అమెరికా లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న వెర్మాంట్ రాష్ట్ర రాజధాని మాంట్పెలియర్‌లో కుంభవృష్టి కురిసింది. సాధారణంగా వర్షాకాలంలో రెండు నెలలపాటు కురవాల్సిన వర్షపాతం ఆదివారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాములోగా నమోదైంది. ఈ దెబ్బకు రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. వినూస్కీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇది సుమారు 20.8 అడుగుల స్థాయికి చేరింది. 1927లో గ్రేట్ వెర్మాంట్ వరదల తర్వాత ఈ స్థాయిలో మరెప్పుడు నీరు ప్రవహించలేదు. అప్పట్లో 87 మంది చనిపోయారు. తాజా వరదలపై సిటీ మేనేజర్ విలియం ఫ్రేసర్ స్పందిస్తూ.. ఈ వరద నష్టాన్ని ఇప్పట్లో చెప్పలేమని వెల్లడించారు.అమెరికా ఈశాన్య ప్రాంతంలో చాలా చోట్ల భారీగా వర్షాలు పడుతుండటంతో జనజీవనం స్తంభించింది. రహదారులు కొట్టుకుపోవడంతో చాలా చోట్ల ప్రయాణాలు నిలిచిపోయాయి. హడ్సన్ వ్యాలీలో ఒక్క ఆదివారమే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యూయార్క్‌లో జనజీవనం స్తంభించింది. ఇక న్యూ ఇంగ్లాండ్‌లో 11 మిలియన్ల మంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. డజన్ల కొద్దీ ప్రజలు కార్లలో రోడ్లపై, వరదనీరు చుట్టుముట్టిన ఇళ్లలో చిక్కుకుపోయారు. మంగళవారం కూడా న్యూఇంగ్లాండ్ చుట్టుపక్కల భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ వరదల కారణంగా అమెరికా ఈశాన్య ప్రాంతంలో 1.3 కోట్ల మంది ప్రభావితమయ్యారు. ఒకరు మరణించగా.. 50 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. ఇప్పటి వరకు వరదల్లో న్యూయార్క్, ఈశాన్య అమెరికాలో 5 బిలియన్ డాలర్ల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. 2011లో హరికేన్ తర్వాత ఈ స్థాయి వరదలు రాలేదు.