సంచలన నిర్ణయాలకు మారుపేరుగా పిలుచుకొనే ట్విటర్(Twitter), టెస్లా(Tesla) కంపెనీల అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) మరో కొత్త కంపెనీ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ‘ఓపెన్‌ఏఐ’(OpenAI) సృష్టించిన చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’(ChatGPT) విప్లవాత్మకంగా మారింది. దీనికి పోటీగా ఎక్స్‌ఏఐ(xAI) పేరుతో మరో కృత్రిమ మేధ(Artificial Intelligence) కంపెనీని నెలకొల్పబోతున్నారు. దీంతో మస్క్ పోర్ట్ ఫోలియోలో మరో కంపెనీ జత కాబోతోంది. ఈ ఏఐ(AI) వెబ్‌సైట్‌ను బుధవారం సాయంత్రం ప్రారంభించబోతున్నారు. ఈ కృత్రిమ మేధ కంపెనీ లక్ష్యం విశ్వాన్ని నిజంగా అర్థం చేసుకోవడమేనని మస్క్ చెప్పారు.
‘‘మా బృందానికి ఎలాన్ మస్క్ నేతృత్వం వహించనున్నారు. గూగుల్ డీప్‌మైండ్, ఓపెన్‌ఏఐ, గూగుల్ రీసెర్చ్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, టెస్లా తదితర వాటిల్లో పనిచేసిన నిపుణులు ఇందులో భాగమయ్యారు’’ అని ఎక్స్‌ఏఐ కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కృత్రిమమేధలో పెను విప్లవంగా మారిన ‘చాట్‌జీపీటీ’ అభివృద్ధి దశలో ఉన్న సమయంలో ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థలో ఎలాన్ మస్క్ భారీ పెట్టబడులు పెట్టారు. తర్వాత ఆయన వాటిని ఉపసంహరించుకున్నారు. అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఓపెన్‌ఏఐలో పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలోనే ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఏఐకి సంబంధించి మానవాళికి ముప్పు పొంచి ఉందని పలుమార్లు మస్క్ హెచ్చరించారు. చాట్‌జీపీటీ (ChatGPT) తరహా చాట్‌బాట్‌లు పక్షపాతంగా వ్యహరించే ప్రమాదం ఉందని తెలిపారు. ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తాను కూడా కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించారు.