DailyDose

ఇమ్రాన్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది

ఇమ్రాన్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. కొన్నాళ్ల క్రితమే అరెస్టై.. కోర్టు ఆదేశాలతో బయట పడ్డ ఆయన్ను ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ వేటాడుతోంది. తాజాగా ఈసీపీ మంగళవారం ధిక్కారణ అభియోగాలపై ఇమ్రాన్‌కు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. ఆయనతోపాటు పాక్‌ మాజీ సమాచారశాఖ మంత్రి ఫవాద్‌ చౌధ్రీ పేరిట వారెంటును జారీ చేసింది.గతేడాది ఇమ్రాన్‌, ఆయన సహచరులు ఫవాద్‌, అసద్‌ ఉమర్‌లు ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్‌పై అభ్యంతరకరమైన భాషను వాడినట్లు ఆరోపణలున్నాయి. పలు మార్లు హెచ్చరించినా వీరిద్దరూ ఈసీపీ ఎదుట హాజరుకాకపోవడంతో చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా.. తాజా అరెస్టు వారెంట్లను ఈసీపీలో నలుగురు సభ్యుల బెంచ్‌ జారీ చేసింది. మరోవైపు అసద్‌ మాత్రం తాను మరో కోర్టులో హాజరు కావాల్సి ఉందని పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈసీపీ అంగీకరించింది.

ఓ ట్రస్ట్‌కు సంబంధించిన కేసులో ఇప్పటికే ఇమ్రాన్‌ఖాన్‌ మే నెలలో అరెస్టయ్యారు. అప్పట్లో ఆయన అరెస్టు దేశం మొత్తాన్ని కుదిపేసింది. సైనిక కోర్‌ కమాండ్‌ కార్యాలయాలపై, లెఫ్టినెంట్‌ జనరల్‌ ఇంటిపై దాడులు జరిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ఆ తర్వాత ఆయనకు న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. ఈ హింసకు సంబంధించి పాక్‌ సైన్యం ఒక లెఫ్టినెంట్‌ జనరల్‌ సహా పలువురు సీనియర్లను విధుల నుంచి తొలగించింది. గతేడాది ప్రధాని పదవి నుంచి వైదొలగిన నాటి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ పలు కోర్టుల్లో కేసులను ఎదుర్కొంటున్నారు.