Agriculture

ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది

ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది

ఉత్తరాది రాష్ర్టాల్లో వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలోని యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. మంగళవారం మధ్యాహ్నానికి నీటి మట్టం 206 మీటర్లు దాటింది. నది ఒడ్డున ఉండే పలు సమీప లోతట్టు ప్రాంతాల్లోకి కూడా నీరు చేరినట్టు తెలుస్తో్ంది. ఈ నేపథ్యంలో అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు. నదిపైన ఉండే పాత రైల్వే బ్రిడ్జిని మూసేశారు. ఢిల్లీకి వరద పరిస్థితి లేదని మంత్రి సౌరవ్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా సరిహద్దులోని జుమ్మాగఢ్‌ నదిపై ఉండే ఓ వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఇండో-టిబెట్‌ సరిహద్దు రహదారి బ్లాక్‌ అయింది. డజనుకు పైగా సరిహద్దు గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్‌ స్పితి జిల్లా చందేత్రల్‌లోని క్యాంపుల్లో దాదాపు 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. మేఘాలు తొలగిన తర్వాత హెలికాప్టర్‌ సాయంతో వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపశమన చర్యలు ప్రారంభించాయి. జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసేందుకు అధికారులు డేటా సేకరిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.