* సరికొత్త రికార్డులను అందుకున్న స్టాక్ మార్కెట్
గురువారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కొత్త రికార్డులను తాకింది. నేడు ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు ఎగిసి 66,064.21 పాయింట్లకు చేరుకుంది. తొలిసారిగా సెన్సెక్స్ 66,000 పాయింట్లను దాటింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 19,567.00 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, ప్రాఫిట్ బుకింగ్ ప్రారంభం కావడంతో సూచీలు తగ్గుముఖం పట్టాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 164.99 పాయింట్ల స్వల్ప లాభంతో 65,558.89 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50లో కూడా అమ్మకాలు కనిపించాయి, దీని కారణంగా మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 29.45 పాయింట్ల స్వల్ప లాభంతో 19,413.75 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో ఉన్న టీసీఎస్ అత్యధికంగా 2.57 శాతం లాభపడింది.
* ఉద్యోగులందరికీ ఏఐ ట్రెయినింగ్ : విప్రో ప్రకటన
కంపెనీలో పనిచేస్తున్న 2.50 లక్షల మంది ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ట్రెయినింగ్ ఇవ్వనున్నట్లు విప్రో బుధవారం ప్రకటించింది. ఈ ట్రెయినింగ్ కోసం బిలియన్ డాలర్లు (రూ.8,200 కోట్లు) ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించింది. రాబోయే మూడేళ్లలో ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు తెలిపింది. క్లౌడ్, డేటా ఎనలిటిక్స్, కన్సల్టింగ్ అండ్ ఇంజినీరింగ్ టీములలోని 30 వేల మంది ఉద్యోగులను ఒక గొడుగు కిందకి తేనున్నట్లు కూడా విప్రో ప్రకటించింది. ట్రిలియన్ల కొద్దీ డాలర్ల విలువను ఎకానమీకి జోడించే సామర్ధ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఉందని వివరించింది. ఉద్యోగుల కోసం ఏఐ కరిక్యులమ్ రూపొందించనున్నట్లు పేర్కొంది. జెన్ఏఐ సీడ్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ కూడా తేనున్నట్లు వెల్లడించింది. విప్రో ఏఐ360 పేరుతో ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకెళ్తోందని విప్రో మేనేజింగ్ డైరెక్టర్ థీరీ డెలాపోర్ట్ ఈ సందర్భంగా చెప్పారు.
* ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది
విద్యుత్ శ్రేణి ద్విచక్ర వాహనాల్లో ఓలా ఎలక్ట్రిక్ కు తిరుగులేదు. ఈ విషయం మేం చెబుతున్నది కాదు. గత రెండేళ్ల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అత్యాధునిక ఫీచర్లు, సూపర్ సాలిడ్ డిజైన్, అల్ట్రా మోడల్ లుక్ లో వినియోగదారులను ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆకర్షించాయి. ఇదే క్రమంలో ఓలా తన మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు ప్రణాళిక చేసింది. ఇప్పటి వరకూ స్కూటర్ల తయారీ పరిమితమైన ఆ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటనలు వచ్చాయి. ఆ కంపెనీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ను మన దేశంలో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అన్నీ కుదిరితే 2023, ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ బైక్ ను మన దేశంలో గ్రాండ్ చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ సోషల్ మీడియాలో కొన్ని హింట్స్, అప్ డేట్స్ ఇచ్చారు.
* హెచ్‌సీఎల్ టెక్ లాభం
ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.3,534 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2022-23 ఇదే కాలంలో ఆర్జించిన రూ.3,283 కోట్లతో పోలిస్తే ఇది 7.6% అధికం. కొత్త ఆర్డర్లు చేజిక్కించుకోవడం ఇందుకు దోహదం చేసింది. అయితే ఈ ఏడాది జనవరి- మార్చిలో నమోదైన రూ.3,983 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 11% తక్కువ. వార్షిక ప్రాతిపదికన ఏకీకృత ఆదాయం రూ.23,464 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.26,296 కోట్లకు చేరింది. జనవరి- మార్చి ఆదాయం రూ.26,606 కోట్లతో పోలిస్తే మాత్రం 1.2% తగ్గింది. నిర్వహణ మార్జిన్ 16.9 శాతంగా నమోదైంది. మార్చి త్రైమాసికంలో నమోదైన 18.25 శాతంతో పోలిస్తే తగ్గింది.
* IAF అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు.ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్ట్ ఆధారంగా దరఖాస్తులు ప్రారంభం: జూలై 27 దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 17 రాత పరీక్ష: అక్టోబర్ 13నుంచి ప్రారంభం వెబ్సైట్: https://agnipathvayu.cdac.in/
* షాకిచ్చిన స్టార్టప్ కంపెనీ
ఒక వైపు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌లు చెబుతుంటే.. ప్రముఖ స్టార్టప్ కంపెనీ ‘నవీ టెక్నాలజీ’ (Navi Technologies) మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగానే 200 మంది ఉద్యోగులను తొలగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు ‘సచిన్ బన్సల్’ నేతృత్వంలో ఉండే నవీ టెక్నాలజీ కంపెనీ తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఇందులో దాదాపు 60 నుంచి 70 శాతం మంది ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన వారు కావడం గమనార్హం. మిగిలిన ఉద్యోగులు వివిధ విభాగాలకు చెందిన వారు.
* నేటితో ముగిసిన 45 ఏళ్ల HDFC ట్రేడింగ్ ప్రయాణం
దలాల్ స్ట్రీట్‌లో 45 ఏళ్ల హెచ్‌డిఎఫ్‌సి షేర్ల ట్రేడింగ్ ప్రయాణం ముగిసింది. HDFC కంపెనీ తన IPOను 1978లో రూ.100 ముఖ విలువతో ప్రారంభించింది. అప్పట్లో HDFC IPOకి ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. కనీసం పూర్తిగా సబ్ స్క్రిప్షన్ కూడా పొందలేదు. ఇష్యూ ధర కంటే దిగువన లిస్ట్ అయ్యింది. కానీ నేడు దేశంలోని టాప్ 10 విలువైన కంపెనీల్లో HDFC కూడా ఉంది. 1992లో, షేరు ధర కేవలం రూ. 7. కానీ మూడు దశాబ్దాల్లో అది అనేక రెట్లు పెరిగింది. ప్రస్తుతం బీఎస్ఈలో రూ.2,742 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల ప్రారంభంలో కంపెనీ షేరు ఆల్ టైమ్ హై రూ.2926కి చేరుకోగా, కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా రూ.5 లక్షల కోట్లను దాటింది. ఈ స్టాక్ చాలా కాలంగా ఇన్వెస్టర్లకు ఇష్టమైన స్టాక్‌లలో ఒకటిగా ఉంది.
* ఏథర్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు ఏథర్ ఎనర్జీ మరో కొత్త ఉత్పత్తిని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కంపెనీ నుంచి అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ మన దేశంలో లాంచ్ కానుంది. దీనిపై ఏథర్ 450ఎస్. ప్రస్తుతం ఉన్న 450ఎక్స్ వేరియంట్ కు ఇది ప్రతి రూపం అని చెప్పొచ్చు. ఈ కొత్త 450ఎస్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే ప్రకటించింది. ధరను వెల్లడించింది. అధికారికంగా బుకింగ్స్, సేల్స్ వచ్చే ఆగస్టు నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, రేంజ్, ధర వంటి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.ఏథర్ కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చవకైన స్కూటర్ గా ఇది నిలువనుంది. దీని ధర రూ. 1.29 లక్షలుగా ఉంది. ఇది గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ముందుకెళ్తోంది. ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్ లో సింగిల్ చార్జ్ పై 115 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఏథర్ దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేయడంతో కొన్ని ఫీచర్లు, లుక్ కూడా రివీల్ అయ్యింది. దీనిలో పోర్టబుల్ ఎల్సీడీ ని అమర్చింది. దీని వల్ల స్కూటర్ ఓవరాల్ ధర తగ్గింది. అయినప్పటికీ ఈ స్కూటర్ కి స్మార్ట్ కనెక్టవిటీ అనేది స్టాండర్డ్ ఫీచర్ గా వస్తోంది.
* 2 శాతం పెరిగిన బండ్ల హోల్‌సేల్స్
మనదేశ మార్కెట్లో ప్యాసింజర్ వెహికల్స్ హోల్‌సేల్స్ ఈ ఏడాదిజూన్‌లో 2 శాతం పెరిగి 3,27,487 యూనిట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా మల్టీ యుటిలిటీ వెహికల్స్‌కు డిమాండ్ బలంగా ఉందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (సియామ్) బుధవారం తెలిపింది. 2022 జూన్ లో డీలర్లకు కంపెనీలు 3,20,985 యూనిట్లను అమ్మాయి. మొత్తం టూవీలర్ల విక్రయాలు గత నెలలో 2 శాతం పెరిగి 13,30,826 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 13,08,764 యూనిట్లను అమ్మారు. త్రీవీలర్లు 2022 జూన్ లో 26,701 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి జూన్‌లో దాదాపు రెండు రెట్లు పెరిగి 53,019 యూనిట్లకు చేరుకున్నాయని సియామ్ పేర్కొంది.
* ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్నుతో ప్రభుత్వానికి ఏటా భారీ ఆదాయం
ఆన్‌లైన్ గేమింగ్ మొత్తం విలువపై 28 శాతం పన్ను విధించాలని ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ. 20,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా గురువారం ప్రకటనలో తెలిపారు.ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం 2-3 శాతం జీఎస్టీని చెల్లిస్తోంది. ఇది సామాన్యులు వినియోగించే ఆహార పదార్థాలపై ఉన్న 5 శాతం కంటే తక్కువగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పరిశ్రమ నుంచి ప్రభుత్వ ఖజానాకు కేవలం రూ. 1,700 కోట్ల జీఎస్టీ మాత్రమే వసూలైంది. వాస్తవానికి జీఎస్టీ కౌన్సిల్‌లోని సభ్యులలో ఒకరు, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు చెల్లిస్తున్న గేమింగ్ ఆదాయంపై 18 శాతం చెల్లిస్తున్నాయి. దానివల్ల ప్రభుత్వానికి 2-3 శాతం మాత్రమే పన్నులు వస్తాయి. తాజా నిర్ణయం ద్వారా మొత్తం విలువపై 28 శాతం పన్ను విధించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 15,000-20,000 కోట్ల వరకు వస్తుందని ఆయన వివరించారు.