Politics

ఏపీలో పొత్తులపై బిజెపి చీఫ్ క్లారిటీ

ఏపీలో పొత్తులపై బిజెపి చీఫ్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే అంతకు మించి ఎక్కువ మేలే కేంద్రం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ప్రత్యేక హోదా కంటే అత్యధిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించే ముందు తొలుత హైదరాబాద్‌లో తన తండ్రి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి అక్కడ నుంచి గన్నవరం చేరుకున్నారు. గన్నవరం నుంచి భారీ ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.రాష్ట్రాన్ని పాలించే అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణం, భూ కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరోవైపు బీజేపీపై రాష్ట్రంలో నడుస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో పొత్తుల వ్యవహారం అధినాయకత్వం చూసుకుంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జనసేన పార్టీతోనే బీజేపీ పొత్తులో ఉందని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. పవన్ ‌కల్యాణ్‌తో నిన్న, మొన్న ఉన్నాం. రేపూ ఉంటాం అని స్పష్టం చేశారు. జనసేనతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందని బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం తొమ్మిదేళ్లలో రూ.20 వేల కోట్లు ఇచ్చిందన్న పురందేశ్వరి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 65శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలి కానీ కనీసం 30 శాతం మేర ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తికాలేదని మండిపడ్డారు. ఇళ్లిస్తామని పేదలకిచ్చిన హామీపై రాష్ట్ర ప్రభుత్వ సమాధానమేంటి? అని దగ్గుబాటి పురంధేశ్వరి నిలదీశారు. మరోవైపు రాష్ట్రంలో రహదారుల దుస్థితేంటో ప్రజలను అడిగితే తెలుస్తుంది అని మండిపడ్డారు. జాతీయ రహదారుల నిర్మాణం తప్ప ఏపీలో నూతన రహదారుల నిర్మాణాలు ఎక్కడని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు.. ఉన్న పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలో ఉపాధి హామీ నిధులే ఉన్నాయని దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.

ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.6 వేలు ఇస్తున్నామని, రైతు భరోసా కింద ఇచ్చే డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయని దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో రైతులకు రూ.12,500 ఇస్తామన్న వైఎస్ జగన్ హామీ ఏమైందో ప్రజలకు చెప్పాలని కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నిలదీశారు. పోలవరం నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదని రాష్ట్రానికి క్లారిటీ వస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

వైసీపీ పాలనలో అరాచకశక్తులు పెట్రేగిపోతున్నాయని కేంద్రమాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. మహిళలపై దాడులు, అధికార పార్టీ అరాచకాలకు అంతేలేకుండా పోయిందని మండిపడ్డారు. బాపట్ల జిల్లా రాజోలులో పదో తరగతి విద్యార్థి అమర్​నాథ్ ను పెట్రోల్ పోసి చంపేయడం, విశాఖలో అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం చూస్తుంటే శాంతిభద్రతలు ఉన్నాయా అని నిలదీశారు. దశలవారీ మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు నాణ్యత లేని మద్యం సరఫరా చే స్తూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారని మండిపడ్డారు. మద్యంలో భారీ ఎత్తున కుంభకోణం జరుగుతోంది అని పురంధేశ్వరి ఆరోపించారు. ఏపీలో ఒకవైపు ఇసుక మాఫియా.. మరోవైపు భూదోపిడీ ఎక్కువగా జరుగుతుందన్నారు. ఏపీని పాలించే అధికారం వైసీపీకి లేదు అని దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.