తైవాన్‌పై కన్నేసిన డ్రాగన్ దేశం చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం, బుధవారం పెద్ద సంఖ్యలో నావికాదళం నౌకలను, ఫైటర్ జెట్లు, బాంబర్లతో కూడిన యుద్ధ విమానాలను తైవాన్ దిశగా పంపించింది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శత్రువుల దండయాత్ర నుంచి తనను తాను కాపాడుకోవడమే లక్ష్యంగా తైవాన్ ప్రతిఏటా నిర్వహించే సైనిక విన్యాసాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తన నౌకలను, యుద్ధ విమానాలను తైవాన్ దిశగా నడిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.చైనా ప్రజా విముక్తి సైన్యం(పీఎల్‌ఏ) మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ 38 యుద్ధ విమానాలను, 9 నౌకలను తైవాన్ వైపు మళ్లించింది. అంతేకాకుండా మరో 30 విమానాలు దూసుకొచ్చాయి. ఇందులో జె–10, జె–16 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని విమానాలు చైనా–తైవాన్ మధ్య జలసంధిలో అనధికారిక సరిహద్దు అయిన మిడ్‌లైన్‌ను దాటి ముందుకెళ్లినట్లు సమాచారం. చైనాకు చెందిన హెచ్–6 బాంబర్లు కూడా దక్షిణ తైవాన్ సమీపంలో సంచరించినట్లు తెలుస్తోంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని డ్రాగన్ చెబుతోంది. ఎప్పటికైనా కలిపేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.