కొత్తగా 26 రఫేల్ యుద్ధ విమానాల ను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. కొనుగోలు ప్రతిపాదనకు రక్షణశాఖ ఓకే చెప్పింది. 26 రఫేల్ విమానాలతో పాటు మూడు స్కార్పీన్ క్లాస్ జలాంతర్గామిల కొనుగోలుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆ కొనుగోలుకు క్లియరెన్స్ ఇచ్చింది. డీఏసీ మీటింగ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ హాజరయ్యారు. త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్‌తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చీఫ్‌లు కూడా ఆ భేటీలో పాల్గొన్నారు. అయితే ఫ్రాన్స్ పర్యటన సమయంలో ప్రధాని మోదీ దీనిపై ప్రకటన చేయనున్నారు.ఒప్పందం ప్రకారం.. భారతీయ నౌకాదళానికి 22 సింగిల్ సీట్ రఫేల్ విమానాలు రానున్నాయి. వీటితో పాటు నాలుగు శిక్షణ విమానాలు కూడా ఉంటాయి. భద్రతా సమస్యల నేపథ్యంలో యుద్ధ విమానాలు, జలాంతర్గాములు కావాలని ఇటీవల నేవీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్ .. మిగ్29 విమానాలను ఆపరేట్ చేస్తున్నాయి. ముంబైలోని మజగాన్ డాక్‌యార్డులో స్కార్పీన్ సబ్‌మెరైన్లను నిర్మించనున్నారు. దాదాపు 90 వేల ఖరీదైన ఒప్పందం జరిగే అవకాశం ఉంది.