WorldWonders

9 ఏళ్లలో మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారో తెలుసా?

9 ఏళ్లలో  మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ (Narendra Modi).. ఇటీవలే 9ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో అనేక దేశాల్లో (Modi Foreign tour) సుడిగాలి పర్యటనలు చేసి.. ద్వైపాక్షిక చర్చలు, పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో గతంలో ఏ భారత ప్రధాని అడుగుపెట్టని దేశాల్లోనూ మోదీ పర్యటించి రికార్డు సృష్టించారు. ఇలా తొమ్మిదేళ్ల కాలంలో 71 విదేశీ పర్యటనలు చేసిన ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా 64 దేశాల్లో 100సార్లకు పైగా అధికారికంగా పర్యటించారు. తాజాగా ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఇదివరకు ఏ భారత ప్రధాని పర్యటించని దేశాల్లో.. మోదీ అడుగుపెట్టిన దేశాలను పరిశీలిస్తే..

మంగోలియా: ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 మేలో మంగోలియాలో పర్యటించారు. ఇక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని కూడా మోదీనే. ఆ సందర్భంగా మంగోలియా-భారత్‌ మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.

ఇజ్రాయెల్‌: జులై 2017లో ఇజ్రాయెల్‌లో నరేంద్ర మోదీ పర్యటించారు. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని కూడా మోదీనే. 70ఏళ్లలో ఏ భారత ప్రధాని అక్కడ పర్యటించలేదు.

పాలస్తీనా: ఫిబ్రవరి 2018లో పాలస్తీనాలో మోదీ తొలిసారి అడుగుపెట్టారు. ఆ పర్యటన సందర్భంగా 50 మిలియన్‌ డాలర్ల విలువైన ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశారు. పాలస్తీనా అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ది స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీన్‌’ సత్కారాన్ని పొందారు.

రువాండా: జులై 2018లో ప్రధాని మోదీ రువాండాలో పర్యటించారు. రువాండా అధ్యక్షుడితోపాటు ఇతర వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. రువాండాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నిలిచారు.

బహ్రెయిన్‌: బహ్రెయిన్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. 2019లో అక్కడ పర్యటించిన మోదీ.. బహ్రెయిన్‌ రాజు షేక్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫాతో చర్చలు జరిపారు. అంతేకాకుండా అక్కడున్న ప్రవాస భారతీయులతోనూ ముచ్చటించారు.

పపువా న్యూ గినియా: 2023లో పపువా న్యూ గినియాలో ప్రధాని మోదీ పర్యటించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ద్వీపదేశంగా పేరొందిన గినియాలో తొలిసారి పర్యటించిన భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు.

ఐర్లాండ్‌: సెప్టెంబర్‌ 24, 2015న ప్రధాని మోదీ ఐర్లాండ్‌ పర్యటన చేపట్టారు. సుమారు 60 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని అక్కడ అడుగుపెట్టడం గమనార్హం. 1956లో జవహార్‌లాల్‌ నెహ్రూ పర్యటనే చివరిది.

ఫిజి: ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ఫిజిలో పర్యటించారు. 1981లో ఇందిరా గాంధీ అక్కడ పర్యటించగా.. 33 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని అక్కడ పర్యటన చేపట్టారు. ఆ సందర్భంగా ఫిజి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.

సీషెల్స్‌: మార్చి 2015లో సీషెల్స్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఇందిరా గాంధీ తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత పీఎం కూడా ఆయనే. 33 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని సీషెల్స్‌లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

యూఏఈ: ఆగస్టు 2015లో ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించారు. 34ఏళ్ల తర్వాత భారత పీఎం అక్కడ పర్యటన చేపట్టారు. తాజాగా ఫ్రాన్స్‌ పర్యటన ముగించుకొని.. జులై 15న యూఏఈలో పర్యటించనున్నారు.

మొజాంబిక్‌: భారత ప్రధాని మోదీ 2016లో మొజాంబిక్‌లో పర్యటించారు. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం గమనార్హం. 1982లో ఇందిరా గాంధీ ఈ దేశంలో పర్యటించారు.

స్వీడన్‌: ఏప్రిల్‌ 2018లో నరేంద్ర మోదీ స్వీడన్‌ పర్యటన చేశారు. 30ఏళ్ల తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించారు. స్వీడన్‌ ప్రధాని స్టెఫన్‌ లోఫెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ సందర్భంగా స్వీడన్‌ రాజు కార్ల్‌ XVI గుస్తాఫ్‌తో భేటీ అయ్యారు.

తుర్కెమినిస్తాన్‌: 2015 జులై 11న నరేంద్ర మోదీ తుర్కెమినిస్తాన్‌లో పర్యటించారు. గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తర్వాత మరే భారత ప్రధాని అక్కడ పర్యటించలేదు. రష్యాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణంలో తుర్కెమినిస్తాన్‌లో పర్యటించారు.

జోర్డాన్‌: ప్రధాని మోదీ 2018లో జోర్డాన్‌లో పర్యటించారు. 30ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని అడుగుపెట్టారు. 1988లో రాజీవ్‌ గాంధీ అక్కడ పర్యటించగా.. ఆ తర్వాత ఏ భారత ప్రధాని మళ్లీ వెళ్లలేదు.