దోశతో పాటు సాంబార్ వడ్డించకపోవడంతో వినియోగదారుల కోర్టు.. ఓ హోటల్‌కు రూ. 3,500 జరిమానా విధించింది. ఈ సంఘటన బీహార్‌లోని బక్సర్‌లో వెలుగు చూసింది.వివరాల్లోకి వెళ్తే.. గతేడాది ఆగస్టు 15వ తేదీన మనీష్ గుప్తా అనే లాయర్.. తన పుట్టిన రోజు సందర్భంగా నమక్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. తనకు ఇష్టమైన మసాలా దోశను ఆర్డర్ చేశాడు. ఈ దోశ విలువ రూ. 140. అయితే దోశతో పాటు సాంబార్ వడ్డించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన లాయర్.. హోటల్ కౌంటర్ వద్దకు వెళ్లి సాంబార్ ఎందుకు ఇవ్వలేదని అడిగాడు. రూ. 140కి హోటల్ మొత్తం కొనాలనుకుంటున్నావా? అని లాయర్‌ను యజమాని ప్రశ్నించాడు. యజమాని సరైన సమాధానం ఇవ్వకపోవడంతో.. లాయర్ లీగల్ నోటీసులు జారీ చేశాడు. ఆ నోటీసులకు కూడా హోటల్ యజమాని స్పందించలేదు.
దీంతో లాయర్ మనీష్ గుప్తా జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్.. 11 నెలల తర్వాత హోటల్ యాజమాన్యానికి జరిమానా విధించింది. 45 రోజుల్లోగా రూ. 3,500లు లాయర్‌కు చెల్లించాలని ఆదేశించింది. గడువు లోపు నగదు చెల్లించకపోతే మొత్తం జరిమానాపై 8 శాతం వడ్డీ వసూలు చేయబడుతుందని తెలిపింది.