మన దేశంలో ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే విస్తరించి ఉంది. అయితే ఒకప్పుడు అంటే భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు రైల్వే అనేది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు ట్రైన్‌లో ఉండే జనరల్, ఏసీ, స్లీపర్ వంటి కోచ్‌లు ఉండేవి కాదు కేవలం ఫస్ట్ (ఏసీ కోచ్) అండ్ సెకండ్ క్లాసులు మాత్రమే ఉండేవి. ఈ ఏసీ కోచ్‌లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎక్కడ మొదలయ్యాయి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఏసీ కోచ్ లేదా ఫస్ట్ క్లాసులో కేవలం బ్రిటీష్ వారు మాత్రమే ప్రయాణించాలి. వారి అవసరాలకు అనుగుణంగా చల్లగా ఉండటానికి ఏసీ బోగీలను ఏర్పాటు చేసుకున్నారు. భారతీయులకు వీటిలోకి అనుమతి ఉండేది కాదు. ఇండియన్స్ సెకండ్ క్లాసులోనే ప్రయాణించాలి.
ఏసీ బోగీలుగా పిలువబడే వాటికి ఏసీలకు బదులు ఐస్ బ్లాక్స్ ఉపయోగించే వారు. వీటిని నేరుగా ఫ్లోర్‌లోనే ఉంచేవారని తెలుస్తోంది. ఈ రైలు మొదట 1928లో ముంబైలోని బల్లార్డ్ పీర్ స్టేషన్ నుంచి ఢిల్లీ, బటిండా, ఫిరోజ్‌పూర్, లాహోర్ మీదుగా ప్రయాణించేది. ఆ తరువాత 1930లో సహరాన్ పూర్, అంబాలా, అమృత్‌సర్, లాహోర్‌కి మళ్లించారు. ఈ రైలు పేరు ‘ఫ్రాంటియర్ మెయిల్’ (Frontier Mail). ఆ తరువాత ఇది 1996లో గోల్డెన్ టెంపుల్ మెయిల్ పేరుతో వినియోగంలో ఉండేది.నిజానికి ఫ్రాంటియర్ మెయిల్ అనేది బ్రిటీష్ వారి కాలంలో అత్యంత విలాసవంతమైన ట్రైన్. కొన్ని నివేదికల ప్రకారం ఇది సుమారు 35 రైల్వే స్టేషన్స్‌లో ఆగుతూ 1893 కిమీ ప్రయాణిస్తుందని సమాచారం. ఒక సారికి ఇది 1300 మంది ప్రయాణికులను తీసుకెళ్లేదని, టెలిగ్రామ్స్ వంటి వాటిని తీసుకెళ్లడానికి కూడా దీన్ని ఉపయోగించేవారని తెలుస్తోంది.