Business

బియ్యం ఎగుమతుల బ్యాన్ దిశగా భారత్

బియ్యం ఎగుమతుల బ్యాన్ దిశగా భారత్

బాస్మతియేతర అన్ని రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేశంలో ఆహార ధాన్యాల ధరల పెరుగుదలతో తలెత్తే ద్రవ్యోల్బణ ప్రమాదాన్ని తట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఎగుమతులు తగ్గితే దేశంలో బియ్యం ధరలు తగ్గుముఖం పడతాయి. ఇప్పటికే ఎల్‌నినో కారణంగా వివిధ దేశాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడంతో భారత్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ధరల పెరుగుదలకు కారణమవుతుందన్న ఆందోళన నెలకొంది. భారత్ నిషేధం విధిస్తే ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 80% ప్రభావితం అవుతుంది. ప్రపంచ జనాభాలో సగం మందికి బియ్యం ప్రధాన ఆహారం. ప్రపంచ ఎగుమతుల్లో 90% ఆసియా నుంచే జరుగుతోంది. 100 కంటే ఎక్కువ దేశాలకు భారత దేశం బియ్యం సరఫరా చేస్తోంది.ఎక్కువగా బెనిన్, చైనా, సెనెగల్, కోట్ డి ఐవోయిర్, టోగో దేశాలకు మన బియ్యం వెళ్తుంటాయి. ఎల్‌నినో ప్రభావంతో పంటలు దెబ్బతింటాయన్న భయంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు రెండేళ్ల గరిష్టానికి పెరిగాయి. ప్రపంచ బియ్యం వ్యాపారంలో భారత్ 40% వాటా కలిగి ఉంది. గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో గోధుమలు, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. అప్పుడు దక్షిణాసియా దేశాలు బియ్యం ఎగుమతులపై 20% సుంకం విధించాయి. గోధుమలు, చక్కెర ఎగుమతులను కూడా పరిమితం చేసింది. అయితే.. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించే విషయం అధికారికంగా ధ్రువీకరించబడలేదు. రిటైల్ బియ్యం ధరలు ఈ ఏడాది ఢిల్లీలో 15%, దేశవ్యాప్తంగా 8% పెరిగాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదలతో ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందన్న భయంతో మోడీ సర్కారు ఈ చర్యలు చేపట్టింది.