ఆమె వయసు 35 ఏండ్లు. ఒంటరిగానే ఉంటోంది. కొన్నాళ్లు డేటింగ్‌లో మునిగి తేలింది. కానీ ఆ జీవితం ఆమెకు నచ్చలేదు. డేటింగ్‌కు స్వస్తి పలికి ఓ తోడు కావాలని ఆమె కోరుకుంటోంది. అయితే తనకు ఓ పెళ్లి కుమారుడిని చూసి పెట్టిన వారికి భారీ నజరానా ఇస్తానని టిక్ టాక్ వేదికగా వెల్లడించింది. తనకు భర్తను వెతికి పెట్టిన వారికి బహుమతిగా 5 వేల డాలర్లు(రూ. 4,10,462) ఇస్తానని ప్రకటన చేసింది.వివరాల్లోకి వెళ్తే.. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఈవ్ టిల్లే కౌల్సన్(35).. కార్పొరేట్ లిటిగేషన్ అటార్నీగా పని చేస్తుంది. కానీ ఒంటరిగా ఉంటూ ఐదేండ్ల పాటు డేటింగ్ చేసింది. అయితే ఆమెకు ఈ డేటింగ్ జీవితం మీద విరక్తి రావడంతో.. తనకంటూ ఓ తోడు ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో తనకు పది లక్షల ఫాలోవర్లు ఉన్న టిక్ టాక్ వేదికగా.. కౌల్సన్ ప్రకటన చేసింది. తనకు భర్తను వెతికి పెడితే 5 వేల డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించింది.
అయితే మీరు వెతికిపెట్టే భర్తతో ఎక్కువ కాలం ఉండలేను. కేవలం 20 సంవత్సరాలు మాత్రమే ఉండి, ఆ తర్వాత విడాకులు ఇస్తాను. ఇక తనకు కాబోయే వాడికి ప్రత్యేక లక్షణాలు ఉండాలని చెప్పిందామె. 27 నుంచి 40 ఏండ్ల మధ్య వయసు ఉండాలి. ఎత్తు 5 అడుగుల పైనే ఉండాలి. పిల్లలు, జంతువులతో పాటు ఆటలను ప్రేమించాలి. అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. ఎత్తుకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాననంటే తాను పొడవుగా ఉంటాను కాబట్టి.. అతను కూడా ఎత్తుగా ఉంటేనే మంచిదని భావిస్తున్నాను. హీల్స్ ధరించొద్దని గతంలో డేటింగ్ చేసిన వ్యక్తులు నన్ను అడిగారు. కానీ అది నాకు ఇష్టం లేదు. డ్రగ్స్ కూడా తీసుకోవద్దని చెప్పింది. ఇక పెళ్లైన తర్వాత రిజిస్ట్రేషన్ దస్త్రంపై సంతకం చేసిన తర్వాత తనకు పెళ్లి సంబంధం చూసిన వ్యక్తికి తాను చెప్పిన విధంగానే నగదు బహుమతిని అందిస్తానని కౌల్సన్ ప్రకటించింది