ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన బిజిబిజీగా కొనసాగింది. బాస్టిల్ డే పరేడ్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ మధ్య సంబధాలు, పరస్పర సహకారం.. తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. పలు ఆశ్చర్యకర బహుమతులతో ఫ్రాన్స్ అధ్యక్షడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులను, అక్కడి ప్రధానిని ఆశ్చర్యపర్చారు. విందు అనంతరం ప్రధాని మోడీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు శాండల్‌వుడ్ సితార్ ను బహుమతిగా అందించారు. ఈ సంగీత వాయిద్యం (వీణ) సితార్ స్వచ్ఛమైన చందనంతో తయారుచేశారు. స్వచ్ఛమైన గంధపు చెక్కలతో.. అందంగా తయారుచేసిన ఈ వీణపై సరస్వతీ దేవి చిత్రాలను, గణేశుడి ప్రతిమను రూపొందించారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా.. నెమలి లాంటి శిల్పాలతో అందంగా తయారుచేశారు.
భారతదేశంలోని తెలంగాణలోని పోచంపల్లి పట్టణానికి చెందిన పోచంపల్లి సిల్క్ ఇకత్ ఫాబ్రిక్ చీరను అధ్యక్షుడి సతీమణి బ్రిగిట్టే మాక్రాన్ కు అందజేశారు. పోచంపల్లి ఇకత్ చీర భారతదేశం గొప్ప వస్త్ర వారసత్వానికి నిదర్శనం.. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ చీరను గంధం బాక్సులో ఉంచి బహూకరించారు. పోచంపల్లి సిల్క్ ఇకత్ చీర హస్తకళ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింభించేలా ఉంటుంది. ఇకత్ సిల్క్ ఫాబ్రిక్ అలంకరణ శాండల్‌వుడ్ బాక్స్‌లో ప్రదర్శిస్తారు.
‘మార్బుల్ ఇన్లే వర్క్’ అనేది సెమీ విలువైన రాళ్లను ఉపయోగించి పాలరాయిపై చేసిన అత్యంత ఆకర్షణీయమైన కళాకృతులలో ఒకటి. అధిక నాణ్యత గల పాలరాయికి ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని మక్రానా అనే పట్టణంలో బేస్ మార్బుల్ కనుగొన్నారు. దానిపై ఉపయోగించే పాక్షిక విలువైన రాళ్లను రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి.. తరలిస్తారు. ఇది అపురూప కళాఖండం.. దీనిని ఫ్రాన్స్ ప్రధానమంత్రికి అందజేశారు.
ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యాయిల్ బ్రౌన్-పివెట్‌కి చేతితో అల్లిన పట్టు కాశ్మీరీ కార్పెట్ ను ప్రధాని మోడీ బహుమతిగా అందజేశారు. కాశ్మీర్ లో చేతితో అల్లిన పట్టు తివాచీలు.. వాటి మృదుత్వం, నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. సిల్క్ కాశ్మీరీ కార్పెట్ రంగులు భిన్నంగా అందరినీ ఆకట్టుకుంటాయి.
ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌కి గంధపు చేతితో చెక్కిన ఏనుగు అంబారిని ప్రధాని మోడీ అందించారు. అలంకారమైన ఏనుగు బొమ్మ స్వచ్ఛమైన చందనంతో చేశారు. సువాసనగల గంధపు చెక్కతో చక్కగా చెక్కిన ఈ సున్నితమైన బొమ్మలు.. అద్భుతంగా ఉంటాయి. ఈ గంధపు ఏనుగు బొమ్మలు భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి.
కాగా.. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. ప్రధాని మోడీకి కూడా ప్రత్యేక బహుమతులను అందించారు. 1916లో సిక్కు అధికారికి పూలను అందజేస్తున్న పారిసియన్ ఫోటో ఫ్రేమ్డ్ ఫాక్సిమైల్.. 11వ శతాబ్దానికి చెందిన చార్లెమాగ్నే చెస్‌మెన్ ప్రతిరూపాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బహుమతిగా ఇచ్చారు.