కేంద్ర ప్రభుత్వం కొత్తగా సౌర విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానుంది. హరిత నగరాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా వాటిని ఏర్పాటు చేస్తోంది. ఈ తరహా ఛార్జింగ్ కేంద్రాలు అనంతపురం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 12 ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించింది. ఇందుకు రూ.95 లక్షలు విడుదల చేసింది. కార్డు ద్వారా ఛార్జింగ్ రుసుము చెల్లించి..వాహనదారుడే ఛార్జింగ్ పెట్టుకోవచ్చని అధికారులు తెలిపారు. వీటి ఏర్పాటు పనులను పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ పర్యవేక్షిస్తుంది. ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు మాత్రమే వాహన వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. సౌర విద్యుత్ ప్యానళ్లతోనే ఛార్జింగ్ కియోస్క్‌లను ట్రాఫిక్‌కు ఇబ్బంది లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. సౌర ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు బ్యాటరీలో స్టోరేజీ అవుతుంది. దాన్ని వాహనాల ఛార్జింగ్ కోసం వినియోగించుకునేందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. ఛార్జింగ్ సేవలు పొందడానికి నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు వెండింగ్ మిషన్ ఉంటుంది. పెట్రోలు వినియోగాన్ని తగ్గించడం ద్వారా వాహన కాలుష్యాన్ని నియంత్రించాలని కేంద్రం నిర్ణయించింది ఇందులో భాగంగానే సౌర విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.