దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి సీఎం కేసీఆర్ ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. 24గంటల పాటు కోతల్లేని కరెంట్ ద్వారా రైతులకు మేలు చేస్తున్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే చీకట్లో మగ్గిపోతుందన్న కాంగ్రెస్ పాలకుల కుటిల యత్నాలను జయించి కేసీఆర్ నిరాటంకంగా విద్యుత్ అందిస్తున్నారు. మొదటగా సాగు రంగాన్ని తోవలో పెట్టి మొత్తం అన్ని రంగాలకు విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. లోటు విద్యుత్ నుంచి రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చి కోతల్లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నారు.వ్యవసాయంతోపాటు ఇతర రంగాలకు కూడా కరెంట్ ముఖ్యమైన అంశమని గుర్తించి రాష్ర్టాన్ని విద్యుత్ వెలుగుల్లో పయనింపజేస్తున్నారు. ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పాలకులు రైతులకు కేవలం 3గంటల కరెంట్ సరిపోతుందంటూ వ్యాఖ్యలు చేస్తుండడం విడ్డూరంగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని భౌగోళిక పరిస్థితుల ప్రకారం పంటల సాగుకు కాంగ్రెస్ చెబుతున్న మూడు గంటల విద్యుత్ అస్సలే సరిపోదు. పీసీసీ చీఫ్ చెప్పే మాటలేవీ రైతులను బతికించదు. కేసీఆర్ పాలనలో నవ్వులు చిందిస్తున్న కర్షకులను కన్నీరు మున్నీరు చేసే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పూటకో మాటలు మాట్లాడుతూ గందరగోళానికి గురి చేస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో 106, కామారెడ్డి జిల్లాలో 104 రైతువేదికల వారీగా సభలు నిర్వహించనున్నారు.
రైతు సమావేశాలకు మంత్రి కేటీఆర్ పిలుపు…కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడను తేటతెల్లం చేయడంతోపాటు క్షేత్ర స్థాయిలో రైతులకు వాస్తవ పరిస్థితులను తెలియజేయడం కోసం బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదిక పరిధిలోని(వ్యవసాయ క్లస్టర్) రైతులందరితో సభలు నిర్వహించి వారికి కరెంట్ సరఫరాపై వాస్తవాలను విడమరిచి చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతువేదికల ద్వారా సదస్సుల నిర్వహణకు బీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తున్నది. సాగుకు కరెంట్ చాలా ప్రధానమైనది. వ్యవసాయరంగం బాగుంటేనే మిగిలిన రంగాలు బాగుంటాయి. అందుకే సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తగా ఆలోచించి వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు.ఇది చాలా గొప్ప నిర్ణయం. కానీ కొందరు దీని వల్ల జరుగుతున్న మేలు, రైతులకు చేకూరుతున్న ప్రయోజనాన్ని పక్కన పెట్టి లేనిపోని ఆరోపణలతో రైతుల నోటికాడి బుక్కను లాగేసుకునే కుట్రలకు పాల్పడుతున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ముందుండి కుయుక్తులను రచిస్తోంది. ఒక్కో ఎకరానికి గంట చొప్పున సన్న, చిన్నకారు రైతులకు కేవలం 3 గంటల కరెంట్ సరఫరా సరిపోతుందంటూ ప్రకటించడం సరికాదన్న వ్యాఖ్యలు రైతులోకం దృష్టికి తీసుకు పోయేందుకు బీఆర్‌ఎస్ నడుంబిగించింది. కాంగ్రెస్ కుట్రలను అసెంబ్లీ ఎన్నికలకు ముందే బట్టబయలు చేయాలని నిర్ణయించింది. రైతులను ఆదుకోవాలంటే కేవలం బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పార్టీ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి.
కాంగ్రెస్ వద్దు… కేసీఆరే కావాలి..పంటలు కావాలా? కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంట్ కావాలా? అన్న నినాదంతో బీఆర్‌ఎస్ పార్టీ వారం రోజులుగా చేస్తున్న ఆందోళనల ఫలితంగా రైతులు ఆలోచనలో పడ్డారు. కేసీఆర్ అందిస్తున్న 24గంటల ఉచిత విద్యుత్‌తో పంటలు కావాలని, కాంగ్రెస్ అందించే మూడు గంటల కరెంట్ వద్దంటూ ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులంతా కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలపై ప్రతి గ్రామం, ప్రతి రైతు ఇంట్లో చర్చ జరగాల్సిన ఆవశ్యకతను బీఆర్‌ఎస్ పార్టీ గుర్తించింది. ఇందులో భాగంగానే నేటి నుంచి 10 రోజుల పాటు అన్ని రైతు వేదికల వద్ద రైతులతో సమావేశాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్ రద్దు అవుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు బీఆర్‌ఎస్ నాయకులు అవగాహన కల్పించనున్నారు.కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు, బీఆర్‌ఎస్ పాలనలోని కరెంట్ వెలుగులను రైతులకు వివరించేలా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
మూడు గంటల విద్యుత్‌తో ఏ పంటను కూడా పండించే పరిస్థితి ఉండదని రైతులు భావిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం కరెక్ట్ కాదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను బట్టి నీళ్లు అవసరం అవుతాయని, ఎకరం వరి పండించాలంటే రోజుకు 50వేల లీటర్ల వరకు నీరు అవసరం ఉంటుందని వ్యవసాయరంగ నిపుణులు సైతం చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు విని రైతులు మోసపోతే వ్యవసాయం చేయలేని దుస్థితి ఏర్పడుతుందన్న అభిప్రాయం అంతటా ఏర్పడింది. మూడు గంటల విద్యుత్‌తో రైతులు ఏ పంటనూ పండించలేరన్న భయాందోళనలు సైతం రైతుల్లో మొదలైంది. కాంగ్రెస్‌ను గతంలో మాదిరిగానే ఎన్నికల్లో పాతరేసి తమకు మద్దతుగా నిలిచే బీఆర్‌ఎస్‌కు అండగా నిలువా ల్సిన అవసరం ఉందని అన్నదాతలు అంటున్నారు.