హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి యూఎస్ఏ ఎన్నారైలు మెమోరాండం సమర్పించారు. అమెరికాలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు కలిసి తమ విజ్ఞప్తిని లేఖ రూపంలో అందించారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే USAలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్‌లను కలిగి ఉన్నాయని.. USA నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమానాన్ని నడపటం వల్ల పెద్ద పట్టణాలతో సమానంగా అభివృద్ది సాధ్యమౌతుందని ప్రవాసులు అన్నారు.వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచదేశాలకు గమ్యస్థానంగా హైదరాబాద్ ఆకర్షణను పెంచుతుందన్నారు. USA నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన మార్గాన్ని ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పర్యాటక శాఖ పరిగణనలోకి తీసుకోవాలని భారతీయ ప్రవాసులు విజ్ఞప్తి చేశారు. ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయటంతో పాటు, కొత్త రూట్లలో విమాన సర్వీసులను తెచ్చేందుకు కృషి చేస్తోందని, కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
అలాగే కిషన్ రెడ్డితో న్యూయార్క్ లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF) నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో అమెరికాలో ఉన్న ప్రవాస తెలంగాణ వాదులు, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులైనందుకు కిషన్ రెడ్డికి టీడీఎఫ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన జరగటంలేదని, కుటుంబ పాలనకే ప్రాధాన్యత ఉందని వారు అభిప్రాయపడ్డారు.అమరుల ఆశయాలను నెరవేర్చే ప్రభుత్వాన్ని తాము కోరుకుంటున్నట్లు ప్రవాసులు తెలిపారు. టీడీఎఫ్ మాజీ అధ్యక్షులు మురళీ చింతలపాని, లక్ష్మణ్ అనుగు, ఇతర కార్యవర్గసభ్యులు కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణ వాసులు, ముఖ్యంగా టీడీఎఫ్ పోషించిన పాత్రను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అభినందించారు.