Politics

ఇవ్వాళా, రేపు బెంగళూరులో విపక్షాల భేటీ

ఇవ్వాళా, రేపు బెంగళూరులో విపక్షాల భేటీ

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మరో కీలక భేటీకి సిద్ధమవుతోంది. సోమ, మంగళవారాల్లో బెంగళూరు నగరంలో విపక్ష పార్టీల మలి భేటీని నిర్వహించనుంది. గత నెల 23న బిహార్‌లో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్న విషయం తెలిసిందే. బెంగళూరులో జరిగే సమావేశంలో పాల్గొననున్న విపక్ష పార్టీల సంఖ్య పెరిగింది. ఈ సమావేశానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమెకు శనివారం స్వయంగా ఫోన్‌ చేసి, సోమవారం జరిపే విందుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే.. ఆమె తన కాలి గాయం కారణంగా ఆమె నేరుగా సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. బిహార్‌ సమావేశంలో పాల్గొనని ఆర్‌ఎల్‌డీ, ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎ్‌సపీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ పార్టీలు బెంగళూరు భేటీకి హాజరవుతాయి. మొత్తం 24 విపక్ష పార్టీలకు పార్లమెంట్‌లో 150 మంది ఎంపీలు ఉన్నారు. కాగా, కర్ణాటక సీఎం సిద్దరామయ్య సోమవారం నిర్వహించే విందులో అనధికారిక చర్చలు జరుగుతాయి. మంగళవారం విస్తృత చర్చల తర్వాత నేతలంతా కలిసికట్టుగా విలేకరుల సమావేశంలో పాల్గొంటారు.తమ కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతో పాటు.. భవిష్యత్‌లో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సహా.. ఆయా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొంటారు.

ప్రతిపక్షాల కూటమిలో కాంగ్రెస్‌ ప్రత్యేకం: చిదంబరం…దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉండి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి సవాలుగా నిలుస్తాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకుడు ఎవరనేది తగిన సమయంలో వెల్లడవుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశం సోమవారం బెంగళూరులో ప్రారంభం కానున్న నేపథ్యంలో పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రె్‌సకు ప్రత్యేక స్థానం ఉందని, అయితే, ఇప్పుడా విషయం ప్రస్తావించాల్సిన అవసరం లేదని చెప్పారు.