Politics

బ్రిజ్ భూషణ్‌కు మధ్యంతర బెయిల్

బ్రిజ్ భూషణ్‌కు మధ్యంతర బెయిల్

రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ)  చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి  తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం రెండు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  డబ్ల్యూఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా వారిని 25,000 బెయిల్ బాండ్‌లు సమర్పించాలని న్యాయమూర్తి హర్జీత్ సింగ్ జస్పాల్ నిందితులను ఆదేశించారు. ఇక, బ్రిజ్‌ భూషణ్ రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించి తదుపరి వాదనలు జూలై 20 మధ్యాహ్నం 12:30 గంటలకు కోర్టు విననుంది.

ఇక, రెజ్లర్లపై లైంగిక వేధింపు ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు జూన్ 15న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఐపీసీలోని  సెక్షన్‌లు 354, 354A (లైంగిక ధింపులు), 354D (వెంబడించడం), 506 (నేరపూరిత బెదిరింపు కింద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆరుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, దాడి, వెంబడించడం వంటి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన 1500 పేజీల ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సింగ్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బ్రిజ్‌  భూషణ్ శరణ్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. ఈ ఛార్జిషీట్‌లో ఆరుగురు రెజ్లర్ల వాంగ్మూలాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు, కాల్ వివరాల రికార్డుల వంటి సాంకేతిక ఆధారాలు ఉణ్నాయి. ఇక, ఫిర్యాదులను ధృవీకరించడానికి పోలీసులు ఫోటో,  వీడియో సాక్ష్యాలను ఉదహరించారు.