* మంగళగిరిలో భారీ స్కామ్
గుంటూరు జిల్లా మంగళగిరిలో సీఎంఎస్ సంస్థ సిబ్బంది ఘరానా మోసం వెలుగుచూసింది. దాదాపు కోటి 12 లక్షల బ్యాంకు సొమ్మును సీఎంఎస్ సంస్థ సిబ్బంది స్వాహా చేశారు. వివరాలు.. సీఎంఎస్ సంస్థ పలు బ్యాంకుల ఏటీఎంలలో నగదు జమ చేస్తుంది. అయితే అందులో పనిచేస్తున్న కొందరు.. బ్యాంకుల ఏటీఎంలలో నగదు జమ చేయకుండా దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. అయితే దాదాపు కోటి 12 లక్షల నగదుకు సంబంధించి తేడా రావడంతో.. క్యాష్ జమచేసే సిబ్బందిపై యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో ఈ భారీ స్కామ్ వెలుగుచూసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కామ్‌కు పాల్పడ్డ ప్రధాన సూత్రధారుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* ఒకే కుటుంబంలో నలుగురి దారుణ హత్య
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం హంతకులు మృతదేహాలను దహనం చేశారు. జోద్‌పూర్ (Jodhpur) జిల్లాలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఎస్పీ ధర్మేంద్ర సింగ్ కథనం ప్రకారం..చెరాయ్ గ్రామానికి చెందిన ఒక కుటుంబాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలను దహనం చేశారు. మృతి చెందిన వారిలో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు గుప్త కూడా అక్కడికి వచ్చారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికులను కలిచివేస్తోంది. చంపిన విధానాన్ని బట్టి చూస్తే.. ఇది ప్రతీకార చర్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో ఈ ఘటన జరగడంపై ప్రతిపక్ష భాజపా నేతలు మండిపడుతున్నారు. గతంలో జరిగిన నేరాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
* నిజామాబాద్ జిల్లాలో దారుణం
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జిరాయత్ నగర్ లో నివసిస్తున్న ఇద్దరు అక్కచెల్లెలను రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. ఇద్దరు అక్క చెల్లెలు మగ్గిడి గంగవ్వ (62), మగ్గిడి రాజవ్వ (72) లను అర్ధరాత్రి వారు నివసిస్తున్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, ఇంటికి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన ప్రకారం గత 20 సంవత్సరాలుగా ఇద్దరు అక్క చెల్లెలు ఒంటరిగా నివసిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం మల్లన్న గుట్ట వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పండుగలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం గంగవ్వ ను ఆమె చిన్న కుమారుడు మహిపాల్ ముదురులోని కంటి ఆసుపత్రిలో కంటి పరీక్ష చేయించి అనంతరం సాయంత్రం వారిద్దరిని మామిడి పల్లి నుండి జిరాయాత్ నగర్ లోని మృతులు ఉంటున్న ఇంట్లో దిగ పెట్టి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం వేకువజామున ఇంట్లో నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కిటికీలు బద్దలు కొట్టి మంటలు ఆర్పే క్రమంలో మృతులు ఇద్దరు కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం డాగ్స్వాడ్ బృందం అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.
* బెంగళూరులో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర
కర్ణాటక బెంగళూరుకు చెందిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అరెస్టు చేసింది. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు, పేలుడుకు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను సయ్యద్ సుహైల్, ఉమర్, జానీద్, ముదాసిర్, జాహిద్‌గా గుర్తించారు. పక్కాగా అందించిన సమాచారం మేరకు కర్నాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉదయం ఉగ్రవాదులు ఉన్న స్థావరంపై దాడి చేశారు.ఐదుగురిని అరెస్టు చేశారు. 2017 లో ఒక హత్య కేసులో దోషులుగా బెంగళూరు సెంట్రల్ జైళ్లో ఉన్న సమయంలో వీరికి ఉగ్రవాదులతో పరిచయమైందని, ఆ తర్వాత ఉగ్రవాదుల సూచనల మేరకు.. బెంగళూరులో వరుస పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని కుట్ర చేసినట్లుగా సీసీబీ పోలీసులు భావిస్తున్నారు. గ్రూప్‌నకు ఎవరైనా సహకరిస్తున్నారా? పేలుళ్లను ఎక్కడ..? ఎలా ప్లాన్ చేశారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.ఇక ఉగ్రవాదుల నుంచి ఏడు పిస్టల్స్, భారీగా లైవ్ బుల్లెట్స్, వాకీటాకీలు, నాలుగు గ్రనేడ్లు, శాటిలైట్ ఫోన్స్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. బెంగళూరు సుల్తాన్‌పాళ్య ప్రాంతంలోని కనకనగర్‌లో ఉన్న ప్రార్థనా స్థలం సమీపంలో పెద్ద కుట్రకు ప్లాన్ చేసినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బెంగళూరు నగరంలో విధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించడంలో సీసీబీ విజయవంతమైందని కమిషనర్ బీ దయానంద్ తెలిపారు.
* హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్
హైదరాబాద్‌లో మరోసారి చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. చిలకలగూడలో వృద్దురాలి మెడలో నుంచి బంగారు చైన్‌ను దుండగులు లాక్కెళ్లాడు. అయితే ఈ ఘటనలో కిందపడటంతో వృద్దురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అందులో వృద్దురాలితో మాట్లాడుతూ కనిపించిన దుండగుడు.. ఆమె మెడలోని బంగారు గొలసు లాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి బాధిత వృద్దురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
* మద్యం తాగుదామని పిలిచి
ప్రకాశం జిల్లా కేంద్రంలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడితో ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు వ్యక్తులు అతడిని చావబాది ఆపై నోట్లో మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. అంతేకాదు, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేస్తూ చితకబాదారు. రక్తమోడుతున్న ఆ గాయాలతో అతను విలవిల్లాడుతున్నా కనికరం చూపలేదు. ఈ మొత్తం ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.అసలేం జరిగిందంటే.. బాధితుడైన గిరిజన యువకుడి పేరు మోటా నవీన్, ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు (అంజి) ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. నేరాలకు పాల్పడే వీరిపై 50కిపైగా గృహ దొంగతనాల కేసులు ఉన్నాయి. నవీన్ పలుమార్లు జైలుశిక్ష కూడా అనుభవించాడు. అంజి మాత్రం కొన్నేళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం మద్యం తాగుదామంటూ నవీన్‌ను అంజి ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వద్దకు పిలిచాడు. వెళ్తే అక్కడ మొత్తం 9 మంది కనిపించారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. ఆపై అంజి, నవీన్ మధ్య పాత గొడవ మరోమారు రేగింది. దీంతో అందరూ కలిసి నవీన్‌పై మూకుమ్మడి దాడిచేశారు. తనను వదిలెయ్యాలని బతిమాలినా వినిపించుకోలేదు. రక్తమోడేలా కొట్టారు. ఆపై నవీన్ నోట్లో మూత్రం పోస్తూ మర్మాంగాన్ని అతడి నోట్లో పెట్టుకోమని బలవంతం చేశారు. కొందరు ఈ తతంగం మొత్తాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.
* కాలువలో వరుసగా కొట్టుకొస్తున్న శవాలు
కృష్ణా జిల్లా పరిధిలో బందరు కాలువ పొడువున ఒకేరోజు మూడు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది. నిన్న కాలువలో కారులో గల్లంతైన అవనిగడ్డకు చెందిన రత్న భాస్కర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో బంధరు కాలువలో గంటల వ్యవధిలోనే ఒక్కోక్క మృత దేహం కొట్టుకొచ్చింది. దీనితో పోలీసులు అటు మృత దేహాలను బయటకు తీసుకొని రాలేక అలా అని వాటిని వదిలేయలేక తలలు పట్టుకుంటున్నారు. అయితే మృత దేహాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే వాటికి పోలీసులు కూడా సమాధానం చెప్పలేక పోతున్నారు.కాలువలో కొట్టుకొస్తున్న మృత దేహాలు మొత్తం గుర్తు పట్టలేనంత మారిపోయి దుర్గంధం వెదజల్లుతు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో పోలీసులకు ఇవి సవాల్గా మారుతున్నాయి.అయితే కాలువలో కొట్టుకోస్తున్న మృత దేహాలు మొత్తం వ్యవహారంలో బాధితులు ఎవ్వరూ అనేది కూడా అంతుచిక్కని ప్రశ్నలుగా ఉన్నాయి.విజయవాడ నుంచి మొదలు కొన్ని కిలోమీటర్ల మేర పారుతున్న కాలువలో ఈ మృత దేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా లేదా ప్రమాదవశాత్తు జరిగిన మరణాల అనేవి మిస్టరీగా మారాయి. అయితే కాలువ వెంబడి ఉండే గ్రామాల ప్రజలు మాత్రం ఇటీవల కాలంలో వరుసగా మృత దేహాలు విజయవాడ శివారు ప్రాంతాలు నుంచి అవనీగడ్డ వరకు ఎక్కడో ఒకచోట రోజూ మృత దేహాలు కనిపిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా చోడవరం, పులిపాక , సమీప గ్రామాలు లంకల పరిధిలోనే ఎక్కువగా నీళ్లు దిగువకు వదిలిన ప్రతిసారి కొట్టుకొస్తున్నాయని తాము వాటిని బయాందోళనకు గురవుతున్నామని అంటున్నారు.
* ఒంగోలులో గిరిజనుడిపై దారుణం
ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ఓ గిరిజన యువకుడిపై పలువురు దుండగులు అమానవీయంగా ప్రవర్తించారు. అతడిని తీవ్రంగా చికతబాది, నోట్లో మూత్రం పోశారు. ఆ మూత్రం పోసే వ్యక్తి, తన మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని కూడా బాధితుడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఘటన నెల రోజుల కిందట ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బాధితుడి ఫిర్యాదు, ‘ఈనాడు’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలకు చెందిన మెటా నవీన్ అనే గిరిజన యువకుడు, మన్నె రామాంజనేయులు అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఎప్పుడూ జులాయిగా తిరిగే వీరిద్దరూ పలు నేరాలకు పాల్పడుతుండేవారు. వీరిద్దరూ కలిసి పలు దొంగతనాలకు కూడా పాల్పడ్డారు. పోలీసులు వీరిపై ఇప్పటి వరకు సుమారు 50 చోరీ కేసులు నమోదు చేశారు. ఇందులో నవీన్ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే మరో వ్యక్తి అంజి పోలీసులకు చిక్కడం లేదు. కాగా.. కొంత కాలం నుంచి వీరద్దరికి పొరపచ్చాలు వచ్చాయి. మనస్పర్థలు రావడంతో పెద్దగా కలిసి ఉండటం లేదు. ఈ క్రమంలో నెల రోజుల కిందట అంజి నవీన్ కు కాల్ చేశాడు. ఒంగోలులోని కిమ్స్ మెడికల్ కాలేజ్ వెనక్కి రావాలని ఆహ్వానించాడు. మద్యం సేవిద్దామని చెప్పాడు.
* లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత శివాజీ
మావోయిస్టు కీలక నేత సున్నూ మడవి అలియాస్ శివాజీ ఛత్తీస్గఢ్లోని BSF పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇతనిపై రూ.3లక్షల రివార్డు ఉంది. ప్రస్తుతం శివాజీ ప్లాటూన్ నంబర్-5లో డిప్యూటీ కమాండర్ హోదాలో పనిచేస్తున్నారు. 2009లో మదనవాడలో ఎస్పీ వినోద్ చౌబోతే సహా 29మంది జవాన్లను, 2006లో దంతెవాడలో ఎనిమిది మంది CISF జవాన్లపై దాడి చేసిన ఘటనలో శివాజీ పాల్గొన్నారు.
* బోధన్ 231 కోట్లు కుంభకోణం
బోధన్ వాణిజ్యపన్నుల శాఖలో నకిలీ చలానాల కుంభకోణం కేసును తెలంగాణ సీఐడీ ఎట్టకేలకు కొలిక్కి తెచ్చింది. కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఈ నెల 11న అభియోగపత్రం దాఖలు చేసినట్లు సీఐడీ మంగళవారం వెల్లడించింది. ఈ కేసులో 123 మంది సాక్షుల్ని విచారించి.. 68 డిజిటల్ ఆధారాలు, 143 పత్రాలు, మూడు ఆడిట్ నివేదికలను సేకరించింది. దర్యాప్తు అనంతరం మొత్తం 34 మందిని అరెస్టు చేసింది. వీరిలో 22 మంది వాణిజ్యపన్నులశాఖ అధికారులే. కుంభకోణం మొత్తం విలువ రూ.231,22,76,967గా సీఐడీ తేల్చింది. బోగస్ చలానాలు సృష్టించి ‘వ్యాటిస్’ పోర్టల్‌లో తప్పుడు ఎంట్రీలు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు గుర్తించింది.నిజామాబాద్ జిల్లా బోధన్ సర్కిల్లో ఈ కుంభకోణం చోటుచేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన సేల్స్‌ట్యాక్స్ ప్రైవేట్ ఆడిటర్ సింహాద్రి లక్ష్మీ శివరాజ్ (మృతి చెందాడు), అతడి తనయుడు సింహాద్రి వెంకట సునీల్ ముఠా ఈ కుంభకోణానికి సూత్రధారులు. వ్యాట్ చెల్లింపుదారుల చలానాలను ఆధారంగా చేసుకొని ఆ నంబర్లతోనే బోగస్ చలానాలను సృష్టించారు. వాటినే పోర్టల్‌లో నమోదు చేసి పన్ను చెల్లించినట్లు చూపారు. కానీ ఖజానాలో బోగస్ చలానాల సొమ్ము జమ అయ్యేది కాదు. ఈ కుంభకోణానికి వాణిజ్యపన్నులశాఖ అధికారులు కొందరు సహకరించారు. 2017లో ఈ బాగోతం బయటపడడంతో తొలుత బోధన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును అప్పట్లో సీఐడీకి బదిలీ చేశారు. శివరాజ్‌కు సంబంధించిన గోదాముల్లో తనిఖీ చేయడంతో బోగస్ చలానాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా కుంభకోణం విలువ రూ.231 కోట్లుగా నిర్ధారణ అయింది.