WorldWonders

భారత విద్యార్థులకు ప్రతిష్టాత్మక అవార్డు

భారత విద్యార్థులకు ప్రతిష్టాత్మక అవార్డు

చెగ్‌. ఆర్గనైజేషన్‌  (Chegg.org) ప్రతిష్టాత్మక  గ్లోబల్‌ స్టూడెంట్‌ ప్రైజ్‌–2023 (Global Student Prize-2023 )  కోసం 50 మందిని ఎంపిక చేస్తూ షార్ట్‌లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు స్థానం సంపాదించారు. 122 దేశాల నుంచి 3,851 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ అవార్డు విజేతలకు రూ. 82.10 లక్షలు (లక్ష అమెరికన్‌ డాలర్లు) అందజేస్తారు. అయితే ఈ ఏడాది అవార్డుకు ఎంపికైన టాప్‌ పది ఫైనలిస్ట్‌లను వచ్చే నెలలో ప్రకటించనున్నారు.అసాధారణ ప్రతిభ కనబరిచి సమాజ హితానికి కృషి చేస్తున్న విద్యార్థులకు ఏటా ఈ అవార్డును అందజేస్తారు. ఈ ఏడాది భారత్‌ నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో పంజాబ్‌లోని లుథియానాకు చెందిన నమ్య జోషి (Namya Joshi) (16)ఎంపికయ్యారు. ఈమె మైన్‌క్రాఫ్ట్‌ (Minecraft)ను ఒక విద్యా సాధకంగా ఉపయోగించి గ్లోబల్‌ టీచర్‌గా అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. మైన్‌క్రాఫ్ట్‌లో వర్చువల్‌ లైబ్రరీని ఏర్పాటు చేశారు. యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించి ఎంతో మందికి అందుబాటులో ఉంచారు.

వినీషా ఉమాశంకర్‌ (Vinisha Umashankar) (16)తమిళనాడులోని తిరువణ్ణామలై  SKP వనితా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నారు. ‘‘సోలార్‌ ఐరన్‌ కార్డ్‌’’ను కనిపెట్టారు. ఈ పరికరం సూర్మరశ్మిని వినియోగించుకుని దుస్తులను ఇస్త్రీ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. 12 ఏళ్ల వయసులోనే విద్యుత్తును పొదుపు చేసే ‘‘స్మార్ట్‌ సీలింగ్‌ ఫ్యాన్‌’’ని కనిపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ఇన్నోవేషన్‌ పోటీల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించారు. గ్లాడ్సన్ వాఘేలా (Gladson Vaghela)(25) గుజరాత్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సొసైటీ మెడికల్ కాలేజీ విద్యార్థి. ప్రపంచవ్యాప్తంగా 150 పైగా దేశాల్లో ప్రజల కోసం గ్లోబల్‌ మెంటల్‌ హెల్త్‌కేర్‌ సర్వీస్‌ ప్రోవైడర్‌ డేటాబేస్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. UNICEF ఇండియాలో YuWaahకు యూత్ సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు.పద్మాక్ష్ ఖండేల్వాల్ (Padmaksh Khandelwal)(17) రాజస్థాన్‌లోని కోటాలోని సర్ పదంపత్‌ సింఘానియా స్కూల్‌లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి. వీరు విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. రవీందర్‌ బిష్ణోయ్‌ (Ravinder Bishnoi)(20) పంజాబ్‌లోని మొహాలీ జిల్లా చండీగఢ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విద్యార్థి. ఇతడు రోబోట్‌, బాహ్యఅస్థిపంజరం, గాలిని ఫిల్టర్‌ చేసే పరికరాలను తయారు చేశారు.