శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన ఇండియాకు రానున్నారు. 20, 21వ తేదీల్లో భారత్‌లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరపనున్నారు. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం రోజున వెల్లడించింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు విక్రమసింఘే భారత్‌లో అధికారిక పర్యటన జరుపుతున్నారని శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్-శ్రీలంకల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమైన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలో భాగంగా విక్రమసింఘే భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ క్రమంలో మనదేశానికి శ్రీలంక ముఖ్యమైన భాగస్వామ్య దేశమని భారత విదేశీ వ్యవహారాల శాఖ దిల్లీలో చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.