Politics

త్వరలో పవన్‌ని కలుస్తా: పురందేశ్వరి

త్వరలో పవన్‌ని కలుస్తా: పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ భారీగా అప్పులు చేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్నో నిధులు సమకూర్చిందని చెప్పారు. పురందేశ్వరి ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ దిశలో రాష్ట్రం ముందుకు సాగాలని ప్రజలు కలలు కంటే.. ప్రస్తుతం అంధకార ఆంధ్రప్రదేశ్‌గా, అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా , అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా నిలబడటం బాధకరమని అన్నారు. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 7.14 లక్షల కోట్ల మేర అప్పు చేసిందని అన్నారు. రాబోయే కాలంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం చూపి రూ. 8, 300 కోట్లు తెచ్చారని విమర్శించారు.

ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు ఏ రాష్ట్రంలో లేవని అన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం ఏపీని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని చెప్పారు. ఏపీలోని ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థిక మంత్రి దృ‌ష్టికి తీసుకెళ్తామని తెలిపారు. జనసేన పార్టీ తమ మిత్రపక్షం అని పురందేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ‌్‌తో భేటీ అవుతానని తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా తన నియామకం జరిగినప్పుడు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ విష్ చేశారని.. తాను కూడా వారితో ఫోన్‌లో మాట్లాడినట్టుగా చెప్పారు. ఆ సమయంలో పవన్ వారాహి యాత్రలో ఉన్నారని.. సమయం చూసుకుని పవన్‌ కల్యాణ్‌‌తో భేటీ అవుతామని చెప్పారు.పొత్తులపై జాతీయ నాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. తమ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపైనే అని చెప్పారు.