దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతాన్ని గత కొద్దిరోజులుగా వరణుడు వణికిస్తున్నాడు. దిల్లీలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో ఆ రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా దిల్లీలో యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చడం ఆందోళనకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టగా.. ఇవాళ ఉదయానికి నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటింది.కేంద్ర జల కమిషన్ సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల సమయానికి దిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు)ని దాటి 205.48 మీటర్లుగా నమోదైంది. ఈ సాయంత్రానికి ఇది 205.72 మీటర్లను చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతవారం యమునా నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరి 208.66 మీటర్లుగా నమోదవడంతో దిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందే.