ఇదేదో డిగ్రీ పేరో, కోర్స్ పేరో కాదు. ఇండియాలో ఇదో లైఫ్‌స్టైల్. కొత్తగా రెక్కలొచ్చిన పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగిరిపోతుందో.. అంతకన్నా స్వేచ్ఛగా యువతరం ఎగిరేలా చేసినా ఓ కొత్త లైఫ్ ట్రెండ్. బీటెక్ పూర్తి చేయకముందే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో స్టూడెంట్స్‌ను కంపెనీలు ఎత్తుకెళ్లిపోయేవే. కెరియర్లో అడుగు పెట్టగానే నెలనెల అకౌంట్లో శాలరీ వచ్చి పడేది. రెండ్రోజులు సెలవు. ఈలోగా కంపెనీలు ఇచ్చే పార్టీలు, ఇన్సెంటీవ్స్‌తో ఒక్కసారిగా లగ్జరీ లైఫ్ ఆవరించేసింది. రెండుమూడేళ్లు తిరిగే సరికి ఒక్కొక్కరికి ప్రమోషన్లు. జీతం వేలు దాటి లక్షల్లోకి ఎగబాకింది. అప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బు చేతికొచ్చింది. చదువుకునే రోజుల్లో వందకి, వెయ్యికి నాన్నని అడిగే రోజుల నుంచి లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెన్ చేసే రేంజ్‌కి ఎదిగిపోయారు. దీంతో ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా అంతా తమ హైక్లాస్ రేంజ్ చూపించుకునే వారు.
ఇలా జాబ్, శాలరీలోనే కాదు చేసుకునే అర్ధాంగి విషయంలోనూ పోటీ పడుతున్నారు టెక్కీలు. ‘దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నాం. లక్షలు సంపాదిస్తున్నాం అంటూ బీకాం చదివి ఇంటి దగ్గరే ఉంటున్న 29 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకులు పోటీ పడుతున్నారు. మాట్రిమోని వెబ్సైట్లో ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఏ సంస్థలో పనిచేస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారనే విషయాల గురించి కులంకషంగా చర్చిస్తూ పెళ్లి ప్రపోజల్స్ సైతం పంపారు. దీంతో వాళ్లు జాబ్ చేస్తున్న కంపెనీలు, తీసుకుంటున్న శాలరీలను చూసి పాపం ఆ యువతికి ఎలాంటి వరుణ్ని భాగస్వామిగా ఎంచుకుంటే బాగుంటుందనే నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇదే విషయాన్ని నెటిజన్లతో పంచుకుంది.
అందులో ‘నా పెళ్లి గురించి మాట్రిమోనీలో 14 మంది యువకులతో విడివిడిగా మాట్లాడుతున్నాను. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్ధం కావడం లేదు’. శాలరీలు ఏడాదికి రూ.14 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉన్నాయి. బైజూస్, ఫ్లిప్‌కార్ట్, డెలాయిట్, టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. మీరే చెప్పండి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో అర్ధం కావడం లేదు. సాయం చేయండని అభ్యర్ధించినట్లుగా ఉన్న ఓ ట్వీట్ వెలుగులోకి వచ్చింది.
ఆ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వయస్సులో ఎందుకు జాబ్ చేయడం లేదని ప్రశ్నిస్తుంటే..మరికొందరు ఈ పోస్ట్ ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా యువతి పెళ్లి చూపుల వ్యవహారం ఎలా ఉన్నా.. ఆర్ధిక మాంద్యంలోనూ ఐటీ ఉద్యోగుల జీతాలు భారీ స్థాయిలో ఉండడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.