వార్తా కథనాలు రాయడంలో జర్నలిస్టులకు సహాయపడేలా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏఐ టూల్స్‌ను వినియోగించేలా వివిధ వార్తాసంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఆ మీడియా సంస్థల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చెందిన న్యూస్ కార్ప్‌తో గూగుల్ సంప్రదింపులు జరుపుతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
హెడ్‌లైన్స్ పెట్టడంలోనూ, విభిన్నంగా వార్తాకథనాలు రాయడంలోనూ జర్నలిస్టులకు ఈ ఏఐ టూల్స్ సహకరిస్తాయని, తద్వారా వారి పనితీరు మెరుగుపడేలా చేస్తాయని గూగుల్ తెలిపింది. జర్నలిస్టులకు ఈ టూల్ పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుందని పేర్కొన్నది. ఈ ఏఐ టూల్‌కు ‘జెనెసిస్’ అని పేరు పెట్టినట్టు సమాచారం. న్యూస్‌లో జెనరేటివ్ ఏఐని వినియోగించేందుకు చాట్‌జీపీటీ యాజమాన్య సంస్థ ఓపెన్‌ఏఐతో జట్టుకట్టనున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో గూగుల్ ఈ కొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ సంస్థ బార్డ్ పేరుతో ఏఐ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.