DailyDose

తిరుమల భక్తులకు మరో గుడ్‌ న్యూస్‌-TNI నేటి తాజా వార్తలు

తిరుమల భక్తులకు మరో గుడ్‌ న్యూస్‌-TNI నేటి తాజా వార్తలు

* వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. మణిపూర్‌ ఘర్షణలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, ఢిల్లీ ఆర్డినెన్స్‌, అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంపై జేపీసీతో విచారణ వంటి అంశాలపై మోదీ సర్కారును నిలిదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికార పక్షం వ్యూహాలకు పదునుపెట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా 26 ప్రతిపక్ష పార్టీలు రెండు రోజుల పాటు బెంగళూరులో సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. తమ కూటమికి ఇండియా అనే పేరును ఖరారు చేశాయి. విపక్షాలకు పోటీగా అధికార బీజేపీ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగనున్నాయి. ప్రతిపక్షాల ఐక్యతకు ఈ సమావేశాలు తొలి పరీక్షగా నిలువనున్నాయి.

వాలంటీర్ల జీతాలకు సంబంధించి సీఎం గుడ్ న్యూస్

AP: 3 లక్షల మంది గ్రామ/ వార్డు వాలంటీర్ల జీతాలకు సంబంధించి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందుగానే వాలంటీర్లకు జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి నెలా 1వ తేదీన జీతాలు క్రెడిట్ అయ్యేలా apcfss.inలో మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో ఇకపై వాలంటీర్ల జీతాల బిల్లులు అప్లోడ్ చేసిన తర్వాతే మిగతా వారి జీతాల బిల్లులు అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది.

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

 తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఇక, రానున్న 24 గంటల్లో అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్రా, తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.. ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, అల్లూరి సీతారామరాజులలో అతి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ సమయంలో తీరం వెంబడి గంటకి 40 నుండి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. రానున్న ఐదు రోజులు వర్షాల ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు.. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది.. కావును.. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.. లోతట్టు ప్రాంతాల్లో అదే విధంగా కొండ ప్రక్కన నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద.

విశాఖ ఎంపీపై లోక్ సభ స్పీకర్ కు రఘురామ ఫిర్యాదు

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తనను చంపుతానంటూ బెదిరించారని ఎంపీ రఘురామకృష్ణ రాజు లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో సహచర ఎంపీల ముందు అసభ్య పదజాలంతో దూషించి, బెదిరించారని అన్నారు. గతంలోనూ తనపై మరో వైసీపీ ఎంపీ మాధవ్ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి

 ఇటీవల తెలంగాణలో బీజేపీలో అధిష్ఠానం భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డిని నియమించింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కిషన్‌ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది. ఇదిలా ఉండగా.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఉదయం 11గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌ నేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నారు.ఉదయం 7:30 గంటలకు కిషన్‌రెడ్డి పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 8:20 గంటలకు అంబర్ పేట మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాల వద్ద నివాళులు అర్పించనున్నారు. 8:50గంటలకు బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం 9:25 గంటలకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం, 9:30కి గన్ పార్క్ అమర వీరుల స్థూపం వద్ద కిషన్‌ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. తర్వాత అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కిషన్‌ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీ శ్రేణులు తరలిరానున్నాయి.

జేపీ నడ్డాతో పవన్ భేటీ

జనసేన అధినేత  పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఎన్డీయే సమావేశానికి హాజరైన అనంతరం.. బీజేపీ అగ్రనేతలతో వరుసగా సమావేశమవుతున్నారు.  తాజాగా  గురువారం ఉదయం పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ మార్పు తర్వాత పరిణామాలు, ఎన్నికలకు సిద్దం అవ్వడంతో పాటు తదితర అంశాలపై  ఈ భేటీలో పవన్, జేపీ నడ్డాలు చర్చించినట్టుగా సమాచారం. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి సంబంధించి జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో విస్తృత చర్చలు జరిపినట్లు నడ్డా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రగతికి అవిశ్రాంతంగా కృషి చేస్తోందని తెలిపారు. ఇక, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పవన్‌తో పాటు జేపీ  నడ్డాను కలిశారు.  ఇక, బుధవారం పవన్ కల్యాణ్.. కేంద్రమంత్రులు మురళీధరన్, అమిత్ షాతో సమావేశమై చర్చలు జరిపిన  సంగతి తెలిసిందే.

* ముస్లిం, క్రిస్టియన్ మహిళలకు అలర్ట్

 మైనార్టీ మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ‘KCR కానుక’ పేరుతో 20 వేల కుట్టుమిషన్లను అందించనుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి నేడు చివరి తేదీ. క్రిస్టియన్ మహిళలకు 2 వేలు, ముస్లిం మహిళలకు 18 వేల కుట్టుమిషన్లను అందిస్తారు. ఉచితంగా శిక్షణ ఇప్పిస్తారు. 21-55 ఏళ్ల వయసు, గ్రామాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి.

తిరుమల భక్తులకు మరో గుడ్‌ న్యూస్‌ 

 తిరుమల భక్తులకు టీటీడీ మరో తిపి కబురును అందజేసింది . తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం( Break Darsan) పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ‘ పే లింక్’ ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు ఇకపై కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చని వెల్లడించింది.ఇప్పటి వరకూ సీఆర్‌వో లో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యూపీఐ ( UPI ), క్రెడిట్ కార్డు ( Credit Card ), డెబిట్ కార్డు (Debit Card) ద్వారా ఆన్‌లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది.ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సీఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుకానుందని అధికారులు వివరించారు.

ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చేసిన పవన్ కళ్యాణ్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, అగ్రనేత నాదెండ్ల మనోహర్ ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.అక్కడ కొందరు అభిమానులు ఆయన చుట్టుముట్టారు. సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం, వారు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యలయానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ పార్టీలోకి చేరబోతున్న కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. ఎన్డీయే పక్షాల సమావేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి జనసేనకు ఆహ్వానం అందింది. దీంతో ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఎన్డీయే భేటీలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ పలువురు కేంద్రమంత్రులను కలిశారు. వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మురళీధర్, అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. అమిత్ షాతో సుమారు 15 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ రోజు ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో గంటకు పైనే భేటీ అయ్యారు.

వైసీపీకి కీలక నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ గుడ్ బై ?

ఏపీలో రామచంద్రపురం నియోజకవర్గంలో వర్గపోరు పంచాయితీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మరియు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు మధ్యన ఇంకా ఒక ముగింపుకు రాలేదు. సీఎం జగన్ సుభాష్ చంద్రబోస్ ను పిలిపించి మాట్లాడినా కుదరలేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం రామచంద్రాపురానికి ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల్ వచ్చే ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే సీటును కోరుకుంటున్నాడు. ఇక జగన్ కూడా ఎమ్మెల్యే సీటును వేణుగోపాల్ కే ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాడట. కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎలాగైనా ఆ టికెట్ ను కొడుకు సూర్యప్రకాష్ కు ఇవ్వాలని అడుగుతున్నాడట. కానీ జగన్ ఎందుకో ఈ విషయంలో లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.రాజశేఖర్ రెడ్డి నుండి ఈయన ఇప్పుడు కేవలం కొడుకు సీటు కోసం పార్టీ మారుతాడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.