పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. రాజ్యసభలో ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్.. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా సభా సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. ఇటీవల మృతి చెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ ఎంపీలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించారు. ఆ వెంటనే లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో కొనసాగే సమావేశాల్లో 32 అంశాలను సభల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. తొలిరోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దిల్లీ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు సమర్పించిన నోటీసులను లోక్‌సభ సచివాలయం అనుమతించింది.
సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్‌లో అనుసరించిన వ్యూహాలపై రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో కొత్తగా ఏర్పాటైన విపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశమైంది. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ), దిల్లీ ఆర్డినెన్సు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్లు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రైల్వే భద్రత, సరిహద్దులో పరిస్థితులు వంటి ఇతర అంశాలూ చర్చకు వచ్చేలా చూడాలని, దానిపై వ్యూహరచనకు ప్రతిరోజూ సమావేశం కావాలని ప్రతిపక్ష శిబిరం నిర్ణయించింది.