ScienceAndTech

చంద్రయాన్-3 నాలుగో కక్ష్య పెంపు విజయవంతం

చంద్రయాన్-3 నాలుగో కక్ష్య పెంపు విజయవంతం

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన ఉపగ్రహం.. ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతున్నది. ఇస్రో క్రమక్రమంగా ఇంజిన్‌ను మండించి కక్ష్యను పెంచుకుంటూ వెళ్తున్నది. ఇప్పటి వరకు మూడుసార్లు చంద్రయాన్‌-3 కక్ష్యను పెంచగా.. గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్య (ఎర్త్‌ బౌండ్‌ ఆర్బిట్‌ మాన్యువర్‌)ను పెంచింది. ఈ నెల 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య మరోసారి ఇంజిన్‌ను మండించి కక్ష్యను పెంచనున్నది. ప్రస్తుతం చంద్రయాన్‌-3 ఉపగ్రహం 51400 కిమీ x 228 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలో ఉన్నది. ఇక చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ వచ్చే నెల 5 నాటికి చంద్రుడి కక్షలోకి చేరుకుంటుందని ఇస్రో వర్గాలు పేర్కొంటుండగా.. ఆగస్టు 23, 24 వరకు చంద్రుడిపై ల్యాండ్‌ చేయనున్నది.

ఇస్రోతో పాటు భారత్‌కు చంద్రయాన్‌-3 మిషన్‌ చాలా ప్రత్యేకమైంది. చంద్రయాన్‌-3 ఇస్రో ‘బాహుబలి’ రాకెట్‌ ఎల్‌వీఎం3 నుంచి నింగిలోకి పంపింది. వాస్తవానికి, భూమి గురుత్వాకర్షణ నుంచి బయటకు పంపేందుకు బూస్టర్లు, శక్తివంతమైన రాకెట్లను వినియోగిస్తుంటారు. నేరుగా చంద్రుడిపైకి వెళ్లాలనుకుంటే.. శక్తివంతమైన రాకెట్‌ అవసరం ఉంటుంది. ఇందుకు ఎక్కువ ఇంధనం సైతం అవసరమవుతుంది. దాంతో ప్రాజెక్టు బడ్జెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేయనున్నది. భూమి నుంచి చందుడికి నేరుగా రాకెట్‌ను పంపాలంటే ఇందుకు భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అమెరికా అంతరక్షిత పరిశోధనా సంస్థ సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఉంది. కానీ, ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌ మిషన్‌ తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నది. చంద్రయాన్‌-3 మిషన్‌ను నేరుగా చంద్రుడిపైకి పంపకుండా.. మొదటి భూమి కక్ష్యలో ప్రవేశపెట్టి.. పలు దఫాల్లో కక్ష్యను పెంచుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. కక్ష్యను తగ్గించుకుంటూ వెళ్తూ చంద్రుడిపై ల్యాండ్‌ చేయనున్నది.

ఇప్పటి వరకు చైనా, రష్యా చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపిన సమయంలో అవి.. జంబో రాకెట్లను ఉపయోగించాయి. చైనా, అమెరికా దాదాపు రూ.1000కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా.. ఇస్రో రూ.500కోట్ల నుంచి రూ.600కోట్లతోనే ప్రయోగం చేపడుతున్నది. అలాగే చంద్రుడి కక్ష్య వరకు వెళ్లే శక్తివంతమైన రాకెట్ సైతం ఇస్రో వద్ద లేదు. ఈ క్రమంలో ఇస్రో క్లిష్టమైన ప్రక్రియలో ప్రయోగం చేపడుతున్నది. చంద్రయాన్-3 విజయవంతమైతే.. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలువనున్నది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా ఈ ఘనతను సాధించాయి. గతంలో చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో విఫలమైన విషయం విధితమే. చంద్రుడి ఉపరితలం మీద దక్షిణ ధ్రువంపై ల్యాండర్ (Lander) సాంకేతిక సమస్యతో కూలిపోయింది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు లోపాలను సరిదిద్దుకొని.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని.. మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ సారి చంద్రయాన్-3ని ఇస్రో చేపట్టింది.