DailyDose

బాలికపై అమానుషం-TNI నేటి నేర వార్తలు

బాలికపై అమానుషం-TNI నేటి నేర వార్తలు

హైదరాబాద్ లో దారుణం

కట్టుకున్న భార్యను బీర్ బాటిల్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించాడో కసాయి భర్త. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన మహిళను స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మహిళపరిస్థితి విషమంగానే వున్నట్లు సమాచారం. ఈ దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివాసముండే ఆనంద్, నవీన భార్యాభర్తలు. 2010 లో వీరికి వివాహం కాగా ఇద్దరు పిల్లలు సంతానం. అయితే ఆటో డ్రైవర్ గా పనిచేసే ఆనంద్ తాగుడుకు బానిసై భార్యాపిల్లల ఆలనాపాలనా మరిచాడు. అంతేకాదు తాగిన మైకంలో భార్య నవీనను చిత్రహింసలకు గురిచేసేవాడు. భర్త వేధింపులు ఇక భరించలేకపోయిన నవీన కొంతకాలంగా దూరంగా వుంటోంది. జూబ్లీహిల్స్ లోనే ఓ హాస్టల్లో వుంటున్న భార్యను బుధవారం ఆనంద్ కలిసాడు. మాట్లాడేది వుందని చెప్పి హాస్టల్ నుండి బయటకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే భార్యను తిరిగి ఇంటికి రావాలని ఆనంద్ కోరగా అందుకామె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.రోడ్డుపైనే భార్యను పట్టుకుని ఆటోలోంచి బీర్ బాటిల్ తీసి కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై నవీన కుప్పకూలిపోగా అలాగే వదిలేసి అక్కడినుండి వెళ్లిపోయాడు.

డబ్బులు అడిగితే ఇవ్వలేదనీ

తండ్రిని డబ్బులడిగితే ఇవ్వలేదనీ కొడుకు సొంత ఇంటిపైనే బాంబ్‌ దాడి చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని వేలచ్చేరి భారతీనగర్‌లో పనీర్‌సెల్వం (60) అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే ఆ ప్రాంతంలో కొద్దిపాటి భూమిని విక్రయించాడు. డబ్బు చేతికి అందగానే అందులో తనకు రూ.3 లక్షలు కావాలని పనీర్‌ సెల్వం కొడుకు అరుణ్‌ కోరాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో అరుణ్ కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి అరుణ్‌ తన బావ ప్రవీణ్‌తో కలిసి ఇంటిపై పేలుడు పదార్ధం విసిరాడు. ఈ ఘటనలో ప్రవీణ్‌ సోదరి రేఖ, మేనమామ వెట్రివేందన్‌ తీవ్రంగా గాయపడ్డారు.కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు పెరుంబాక్కం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేయగా వారి ఇంట్లో మరో నాలుగు బాంబులు లభ్యమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు బైక్‌పై వచ్చి బాంబులు విసిరి పరారైనట్లు తెలిసింది. నిందితులు అరుణ్, ప్రవీణ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

విద్యార్థినిపై స్కూల్‌వ్యాన్‌ డ్రైవర్‌ అత్యాచారం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ దెహాత్‌ జిల్లాలో ఓ విద్యార్థిని (14)పై ఆమె రోజూ స్కూలుకు వెళ్లే వ్యాను డ్రైవరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ బాలిక పక్కింటివారు ఇటీవల ఊరికి వెళ్లారు. ఆ ఇంట్లో ఒక్క మహిళ మాత్రమే మిగిలింది. ఆమె బాలికను ఇంటికి పిలిచి.. తోడుగా పడుకోమని కోరింది. తల్లిదండ్రుల అంగీకారంతో ఆమె వెళ్లింది. పథకం ప్రకారం ఇదంతా చేసిన మహిళ ఆ రాత్రి వ్యాన్‌ డ్రైవరు నౌషాద్‌కు ఫోన్‌ చేసి ఇంటికి పిలిచింది. వెంటనే వచ్చిన అతడు.. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను మహిళ వీడియో తీసి వైరల్‌ చేసింది. భయంతో బాధితురాలు.. ఈ విషయాన్ని తన ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. వీడియో వ్యవహారం ఇంట్లో తెలిసి బాలికను నిలదీయగా.. జరిగినదంతా చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు నౌషాద్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.

కారు బోల్తా పడి ఒకరి మృతి

 బోధన్‌లోని బైపాస్‌ రోడ్డులో బొజ్జ వినాయకుడి ఆలయం సమీపంలో మంగళవారం రాత్రి కారు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. బోధన్‌లోని ఆజంగంజ్‌ కాలనీకి చెందిన సూరజ్‌ దాలియా రాహూల్‌ దాలియా తమ మిత్రుడు యష్‌రాండర్‌తో కలిసి ఆచన్‌పల్లిలో గల దీపక్‌ స్వీట్‌ హోంకు వెళ్లారు.అనంతరం యష్‌ రాండర్‌ను ఇంటి వద్ద వదిలి వేయడానికి ఆచన్‌పల్లి బైపాస్‌ మీదుగా వెళ్తుండగా గణపతి ఆలయ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. సూరజ్‌ దాలియాకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.గాయపడ్డ మరొకరిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో రాహుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. రాహూల్‌ దాలియా తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

బాలికపై అమానుషం

ఢిల్లీలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.. ఓ బాలికను ఇంట్లో పెట్టుకొని పనిచేయించడంతో పాటు చిత్ర హింసలు పెట్టిన ఘటన వెలుగు చూసింది.. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.. దిల్లీ ద్వారక ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళా పైలట్‌, ఎయిర్‌లైన్స్ ఉద్యోగి అయిన ఆమె భర్త రెండునెలల క్రితం 10 ఏళ్ల బాలికను తమ ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. అయితే ఆ దంపతులు ఆ అమ్మాయిపై కర్కషంగా ప్రవర్తించి గాయాలపాలు చేశారు.ఆ సమయంలో ఆ బాలికను చూసేందుకు వచ్చిన బంధువు ఆమె ఒంటిపై గాయాలు ఉండడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలోనే సమాచారం తెలుసుకున్న బంధువులు, స్థానికులు గుంపుగా వచ్చి ఫైలట్‌ దంపతులను రోడ్డుపైకి ఈడ్చి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది… ఈ ఘటన పై మండిపడ్డ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో మహిళా పైలట్‌ను విధుల్లోంచి తొలగించింది.అదే విధంగా ఇక ఆమె భర్త పనిచేస్తున్న ‘విస్తారా’ ఎయిర్‌లైన్స్‌ కూడా అతడిని ఉద్యోగం లోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ ఘటన గురించి ప్రస్తావించకుండానే ‘విస్తారా’ సంస్థ ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. ” విస్తారా సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి హింస ఘటన మా దృష్టికి వచ్చింది.. నిబంధనలను మేము పాటిస్తాం ఇలా చెయ్యడం అమానుషం అందుకే వారిని విధుల నుంచి తొలగించడం జరిగిందని ప్రముఖ సంస్థలు పేర్కొన్నారు.. 10 ఏళ్ల బాలికను ఇంటి పనిమనిషిగా పెట్టుకోవడంతో పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారని దంపతుల పై ఆరోపణలున్నాయి. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

జనాలపైకి దూసుకెళ్లిన కారు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన కారు రోడ్డుపై ఉన్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. కాగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు, అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సమాచారం ప్రకారం.. ఇస్కాన్ బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి థార్ వాహనం , డంపర్ లు ఢీకొన్నాయి. ప్రమాదాన్ని చూసేందుకు వంతెనపై జనం గుమిగూడారు. ఇంతలో అతివేగంతో దూసుకొచ్చిన జాగ్వార్ కారు అక్కడ ఉన్నవారిపైకి దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీసు కానిస్టేబుల్, హోంగార్డు కూడా ఉన్నారు.బుధవారం-గురువారం మధ్య రాత్రి సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఇస్కాన్ ఫ్లైఓవర్‌పై మహీంద్రా థార్ వెనుక నుండి డంపర్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సన్నాహాలు చేస్తుండగా, అతివేగంతో దూసుకొచ్చిన కారు జనాన్ని తొక్కేసింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. డబుల్ ప్రమాదం జరగడంతో, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. పోలీసులు ఇస్కాన్ వంతెన మొత్తాన్ని మూసివేశారు.

ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ అనుమానాస్పద మృతి

 ఢిల్లీలోని ఓ ఫ్యాషన్ డిజైనర్ ఇంట్లో గురువారం శవమై కనిపించింది. ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన 26 ఏళ్ల మహిళ గురువారం ఉదయం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని తన ఇంట్లో శవమై కనిపించింది. మృతి చెందిన మహిళను దీపికగా గుర్తించారు.ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు.. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. కేసు నమోదు చేసి మృతుల కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ సమయంలో, సూసైడ్ నోట్ దొరికిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. అసలేం జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. దీపిక గత కొంత కాలంగా ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె సూసైడ్ చేసుకుందా.. ఎవరైనా హత్య చేసి సూసైడ్‌గా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మహిళా పైలట్ జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి మరీ చితకబాదారు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళా పైలట్‌, ఆమె భర్తను కొందరు వ్యక్తులు చితకబాదారు. వారి ఇంట్లో పనిమనిషిగా ఉన్న 10 ఏళ్ల బాలికను పనిలో పెట్టుకోవడమేకాకుండా నిత్యం బాలికను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో బంధువులు బుధవారం దాడి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మైనర్‌పై దాడికి పాల్పడిన కౌశిక్ బాగ్చి (36), అతని భార్య పూర్ణిమ బాగ్చి (33)లను అరెస్టు చేశారు.బాధితురాలి కుటుంబం అపార్ట్‌మెంట్‌కు దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న జెజె కాలనీలో నివసిస్తున్నారు. రెండు నెలలుగా బాలిక అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోంది. యజమాని పూర్ణిమా నిత్యం బాలికను కొడుతున్న సంగతి బాలిక తల్లిదండ్రులకు తెలియదు. యజమాని బాలికను కొట్టడాన్ని గమనించిన బాధితురాలి బంధువు ఇతర బంధువులు ఇరుగుపొరుగుకు ఈ విషయం చెప్పడంతో వారంతా పూర్ణిమతో వాగ్వాదానికి దిగారు. కోపోధ్రిక్తులైన బాలిక బంధువులు ఫైలట్‌ యూనిఫాంలో ఉన్న మహిళ జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి ఈడ్చి మరీ కొట్టారు. ఆమె భర్త కౌశిక్‌ను కూడా చితకబాదారు. క్షమించమని వేడుకున్నా ఆమెను వదలలేదు.

వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులకు బెయిలు మంజూరు

వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు ముగ్గురికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలతో విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో వారికి హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్‌ మే 30న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదే రోజు పలువురిపై కేసు నమోదు చేశారు. జీఎస్టీ అధికారులు బి.మెహర్‌కుమార్‌, కె.సంధ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ కేవీ చలపతి, ఆఫీసు సబార్డినేట్‌ ఎం.సత్యనారాయణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంధ్యకు బెయిలు మంజూరు చేసిన దిగువ కోర్టు.. మిగిలిన ముగ్గురికి నిరాకరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించగా.. బెయిలు లభించింది. విజయవాడ అనిశా కోర్టులో పూచీకత్తులు సమర్పించాలని, అభియోగపత్రం దాఖలు చేసేంత వరకు లేదా మూడు నెలల పాటు ప్రతి రెండో శనివారం ఉదయం 10 నుంచి 1 గంట మధ్య పటమట ఎస్‌హెచ్‌వో ముందు హాజరుకావాలని పిటిషనర్లకు కోర్టు షరతులు విధించింది. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరించొద్దని సూచించింది. ఇదే కేసులో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అయిదో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

ఒకే ఫ్యామిలీలో ముగ్గురి దారుణ హత్య, చిన్నారి సజీవదహనం

రాజస్థాన్లోని జ్యోథ్పూర్ లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని గొడ్డలితో నరికి హతమార్చాడు. ఆ తర్వాత వారి ఆరు నెలల బాలికను సజీవ దహనం చేశాడు. అతను ఆ కుటుంబానికి బంధువే కావడం గమనర్హం. జోద్పూర్ జిల్లాలో ఓసియన్ ప్రాంతంలోని చెరియా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.ఆ సమయంలో పప్పు రామ్ (19) అనే యువకుడు తన బాబాయి  పూనారం ఇంటికి వచ్చాడు. ఆ ఇల్లు పొలాల మధ్యలో ఉంది.  రావడం రావడమే ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో పునారాం (60), అతడి భార్య భన్వారీ (55), వారి కోడలు దాపు(23)ల మీద దాడి చేశాడు. గొడ్డలితో గొంతు నరికి హతమార్చాడు. ఆ తరువాత వారి శవాలను వంట గదిలోకి తీసుకెళ్లాడు.అక్కడ వాటిని తగలబెట్టాడు. ఆ తరువాత అతడికి ధాపు కుమార్తె ఆరు నెలల చిన్నారి మనిషా కనిపించింది. ఆ చిన్నారిని సజీవంగానే ఆ మంటల్లోకి విసిరేశాడు పప్పురామ్. కొద్ది రోజుల క్రితం గుజరాత్ లో  అనుమానాస్పద స్థితిలో పప్పురాం సోదరుడు మృతి చెందాడు. తన సోదరుడు చనిపోవడంలో పూనారం హస్తం ఉండొచ్చని పప్పురాం అనుమానించాడు. పునారామ్ కు ఇద్దరు కొడుకులు. ఒకరు రాళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతను నైట్ డ్యూటీకి వెళ్ళాడు. మరో కొడుకు  కుటుంబంతో కలిసి ఛాములో ఉంటున్నాడు. దీంతో  పప్పురాం ఆ ఇంట్లో తనను అడ్డుకునే వారు ఉండబోరని భావించాడు.అతని అంచనా ప్రకారమే అతన్ని ఎవరు అడ్డుకోలేక పోయారు. దీంతో పప్పురాం బాధితుల ఇంట్లో బీభత్సం సృష్టించాడు