Politics

ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌పై జగన్ సమీక్ష

ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌పై జగన్ సమీక్ష

ప్యూచర్‌ టెక్నాలజీ స్కిల్స్‌ పై హైపవర్‌ వర్కింగ్‌ గ్రూపుతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్‌.. విద్యాశాఖ అధికారులు, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, డేటావివ్‌ వంటి ప్రఖ్యాత సంస్ధల ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.. విద్యారంగంలో కీలక మార్పులపై సమాలోచనలు, కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు.. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు ఫ్యూచర్‌ టెక్నాలజీపై నైపుణ్యాభివృద్ధి.. ఆ మేరకు పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక రూపకల్పన చేయాలన్నారు.. బోధనలో, శిక్షణలో ఫ్యూచర్‌ టెక్నాలజీ వినియోగంపై కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే సమావేశం నాటికి వీటిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.. మనం రెండు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాం.. ఒకటి పాఠశాల విద్య, రెండోది ఉన్నత విద్య.. పాఠశాల దశ నుంచి ఉన్నత విద్య వరకు ఈ రెండింటిని అనుసంధానం చేయాలి. పాఠ్యప్రణాళిక కూడా సమ్మిళితం చేయాలి.. ఇది ప్రధాన లక్ష్యం అని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్.

ఇక, ఉన్నత విద్యలో మరింత మెరుగైన సంస్కరణలు అవసరం. ఇండియాలో ఏఐ వంటి వర్టికల్స్‌ అభివద్ధి చాలా తక్కువగా ఉంది. వాటిని బోధించే సిబ్బంది కొరత కూడా ఎక్కువుగా ఉంది. వీటిని పాఠ్యప్రణాళికలో భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్‌.. ఉదాహరణకు ఫైనాన్స్‌ సబ్జెక్ట్‌నే తీసుకుంటే.. బీకామ్‌ కాకుండా మరో వర్టికల్‌ ఇందులో లేదు. బీకామ్‌లో ఫైనాన్స్‌కు సంబంధించిన ఇతర వర్టికల్స్‌ ఏవీ అందుబాటులో లేవు. అక్కడితో ఆగిపోవాల్సిన పరిస్థితి. రిస్క్‌ మేనేజిమెంట్, అసెట్‌ మేనేజిమెంట్, రియల్‌ ఎస్టేట్‌ మేనేజిమెంట్, ఫైనాన్స్‌ వంటి అంశాలను కరిక్యులమ్‌లో భాగంగా చేయాలి. ఎందుకు వీటిని కరిక్యులమ్‌లో భాగంగా అందుబాటులోకి తీసుకునిరాలేకపోతున్నామంటే.. ఈ వర్టికల్స్‌ను బోధించే సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడమే. వీటికి సంబంధించిన కంటెంట్‌ అందుబాటులో ఉన్నా అమల్లోకి తీసుకునిరాలేని పరిస్థితి. వెస్టర్న్‌ వరల్డ్‌లో వీటికి సంబంధించిన ఫ్యాక్టలీ ఉంది, ఇవన్నీ అక్కడ కరిక్యులమ్‌లో భాగంగా ఉన్నాయన్నారు సీఎం జగన్‌.

కరిక్యులమ్‌లోకి వాటి అన్నింటినీ తీసుకుని రావడమన్నది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం అన్నారు సీఎం జగన్‌.. వర్చువల్‌ రియాలిటీ, అగ్‌మెంటెడ్‌ రియాలటీ వంటి అంశాలు కరిక్యులమ్‌లో చేర్చాలి. ఆ స్ధాయికి తీసుకునిపోవాలి. ఇది కేవలం ఒక సంస్ధకే పరిమితం కాకుండా… పెద్ద సంఖ్యలో స్కూళ్లు, కాలేజీల్లో ఈ కరిక్యులమ్‌ని తీసుకునిరావాలి. ఒక తరంలో వీటిని మనం నేర్పించగలిగితే.. ఆయా వర్టికల్స్‌లో మనం నిపుణులను తయారుచేయగలుగుతామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 6వ తరగతి నుంచి తరగతి గదులు డిజిటలైజేషన్‌ ప్రక్రియను చేపట్టాం. ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 63 వేల తరగతి గదులలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబరు ఆఖరు నాటికి ఈ 63వేల తరగతి గదులను డిజిటలైజ్‌ చేయబోతున్నాం. ఇప్పటికే 32వేల తరగతిగదుల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియ ముగిసింది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెఫ్ట్‌ను అమలు చేస్తున్నాం. బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ పంపిణీ చేస్తున్నాం. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాం. 8వతరగతి విద్యార్ధులకు ట్యాబులు కూడా ఇస్తున్నాం. ఈ మార్పులన్నీ ఏపీలోని స్కూళ్లలో చోటుచేసుకుంటున్నాయి. స్కూళ్లలో వస్తున్న ఈ మార్పులను ఇప్పుడు ఉన్నత విద్యతో సమ్మిళతం చేస్తూ.. మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నదే మనముందున్న సవాలు అన్నారు.

ఇక, పాఠశాల స్ధాయిలో కూడా బోధనతో పాటు బోధనా విధానాలు కూడా ఎలా మార్పుతీసుకురావాలన్నది ముఖ్యమైన అంశం అన్నారు సీఎం జగన్.. ఇంకా స్టేట్‌ సిలబస్, నేషనల్‌ సిలబస్, సీబీఎస్‌ఈ వంటి అంశాలకే పరిమితం కాకుండా.. ఐబీ (ఇంటర్‌నేషనల్‌ బాకలారియేట్‌) యుగంలో ఉన్నాం. మనం వాటిని అవలంభించలేకపోతే, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఒడిసి పట్టుకోలేకపోతే.. వెస్టర్న్‌ కంట్రీస్‌లో పిల్లలు మాదిరిగా మన పిల్లలు వాటికి సమాధానాలు చెప్పగలిగే స్ధితిలో ఉండరు. ఐబీలో వారి ప్రశ్నల స్ధాయికి, మనకి చాలా తేడా ఉంది. వెస్టర్న్‌ వరల్డ్‌లో ఉన్న బోధనాస్ధాయిలను అలవర్చుకుంటేనే మన పిల్లలు కూడా ఆ స్ధాయికి చేరి పోటీపడగలుగుతారు. దీనికోసం ప్రశ్నావిధానం మారాలి. పిల్లలకు బోధించే విధానంలో కూడా మార్పు రావాలి. కరిక్యులమ్‌లో కూడా మనం వాళ్లకంటే ఏ మేరకు మెరుగుపర్చుకోవాల్సింది ఉందన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. ఆ స్ధాయిలో లేకపోతే వాటిని చేరుకోవడానికి ప్రయత్నించాలి. వీటన్నింటినీ మన కరిక్యులమ్‌లో భాగంగా చేయగలిగినప్పుడే మన పిల్లలు వాళ్లతో పోటీపడగలుగుతారు. మనం 3వతరగతి నుంచే టోఫెల్‌ ప్రైమరీ, టోఫెల్‌ జూనియర్, ప్లస్‌–1, ప్లస్‌ –2 లెవల్లో సీనియర్‌ పరీక్షలను మన కరిక్యులమ్‌లో భాగం చేయబోతున్నాం. ఈ మార్పులన్నీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పేదవిద్యార్ధుల కోసం చేస్తున్నాం. ఈ మార్పులన్నీ పేదపిల్లలకు అందించగలిగితే.. అది గొప్ప మార్పు అవుతుంది. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నాం అన్నారు జగన్.

ప్రభుత్వ బడుల్లో మౌలికసదుపాయల కల్పనలో వచ్చిన మార్పులను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 5వ తరగతి వరకు స్మార్ట్‌ టీవీ ఏర్పాటు చేశాం. 6వతరగతి నుంచి ప్రతి తరగతిగదిలోనూ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌ ఏర్పాటు చేశాం. వీటి మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. పిల్లలు గ్రాడ్యుయేషన్‌ పూర్తియ్యే వరకు భరోసా అందించాలన్నదే మా ప్రయత్నం. ఇందులో భాగంగా తల్లులు తమ పిల్లలను స్కూల్‌కు పంపించేలా ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే నూటికి నూరు శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలవుతోంది. అంతే కాకుండా రూ.20 వేల వరకు పిల్లలకు బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చులు కూడా చెల్లిస్తుంది. మా ప్రభుత్వం మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తుందన్నారు ఏపీ సీఎం.

ఐబీతో కలిసి ఒక కొత్త సిలబస్‌ను రూపొందించబోతున్నాం. అది దేశానికే బెంచ్‌మార్క్‌ కాబోతుంది. రాబోయే రోజుల్లో ఐబీ, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌తో కలిసి టీచింగ్‌ మెథడాలజీని, పాఠ్య ప్రణాళికను మార్చబోతున్నాం. దీనికి కావాల్సిందల్లా మీ లాంటి వ్యక్తుల సహకారం. అప్పుడు కల సాకారమవుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.. ప్యూచర్‌ టెక్నాలజీ స్కిల్స్‌ను పాఠశాల స్ధాయికే పరిమితం చేయకుండా.. ఉన్నత విద్యలో కూడా ప్రవేశపెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను చేర్చగలిగితే.. మంచి ఫలితాలు వస్తాయి. ఈ మార్పులను తేగలిగితే గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేనాటికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కొన్నికోర్సుల కోసం ఎందుకు విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది ? అదే సబ్జెక్ట్‌లను మన దేశంలో బోధిస్తే.. వర్చువల్‌గా వాటిని అందుబాటులోకి తీసుకునిరాగలిగితే ఇక్కడే చదువుకునే అవకాశం ఉంటుంది. వర్చువల్‌ టీచింగ్, వర్చువల్‌ కంటెంట్‌ అందుబాటులోకి తీసుకునిరావాలి. ఇంజనీరింగ్, మెడిసిన్‌లో సాంప్రదాయ విధనాల్లో కూడా మార్పులు రావాలి. వాటిని పునర్‌నిర్వచించాల్సిన అవసరం ఉంది. రోబోటిక్స్‌ ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉంది. వీటిమీద దృష్టి పెట్టాలి. ఈ మార్పులన్నీ ఉన్నతవిద్యలో ప్రవేశపెట్టాలి. ఈ మార్పులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని స్కూల్‌ ఎడ్యుకేషన్‌తో పాటు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో కూడా ఒక విధానాన్ని రూపొంచాలని.. వచ్చే సమావేశం నాటికి ఒక స్పష్టమైన విధానం తీసుకురావాలి. అదే సమయంలో ఉన్నత విద్యలో కూడా ఒకవైపు పరీక్షా విధానం, మెథడాలజీ, బోధనా పద్ధతులు, పాఠ్యప్రణాళికలో తీసుకురావాల్సిన మార్పులపై దృష్టి సారించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.