Politics

29న నిజామాబాద్‌ ఐటీ హబ్‌ను ప్రారంభించనున్న కేటీఆర్

29న నిజామాబాద్‌ ఐటీ హబ్‌ను ప్రారంభించనున్న కేటీఆర్

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంలో భాగంగా నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో చేపట్టిన ఐటీ హబ్‌ భవన నిర్మాణం పూర్తయింది. 3.20 ఎకరాల విస్తీర్ణంలో జి+3 అంతస్తుల్లో ఈ హబ్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగించే కంపెనీల కోసం 50 వేల చదరపు అడుగుల స్థలాన్ని సిద్ధం చేశారు. ఇప్పటివరకు 12 కంపెనీలు ఐటీ హబ్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి.ఈ హబ్‌ నిర్మాణం దాదాపు నాలుగేళ్ల కిందట ప్రారంభమైనా.. వివిధ కారణాలతో ఆలస్యమైంది. తొలుత రూ.25 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అధిక విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టేందుకు.. వ్యయాన్ని రూ.50 కోట్లకు పెంచారు. ఏడాది కిందటి వరకు పనుల్లో జాప్యం జరిగినప్పటికీ కొద్ది నెలలుగా వేగం పెంచి, పూర్తి చేశారు. నిజామాబాద్‌ నగర పాలక సంస్థ నూతన భవనంతో పాటు ఐటీ హబ్‌ను ఈ నెల 29న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తెలిపారు. గురువారం ఆయన హబ్‌ను పరిశీలించారు.

నేడు జాబ్‌ మేళానిజామాబాద్‌ ఐటీ హబ్‌లో కార్యకలాపాలు నిర్వహించనున్న  సంస్థలు.. శుక్రవారం నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో ఉద్యోగ మేళాకు ఏర్పాట్లు చేశాయి. దాదాపు 6 వేల మంది అభ్యర్థులు మేళాలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.