దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినియోగదారులకు వాట్సాప్ ద్వారా కూడా పలు సేవలను అందిస్తోంది. ఎస్బీఐ వినియోగదారులు 13 రకాల సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. రిజిస్టర్ ఫోన్ నెంబరు సాయంతో ఆయా సేవలు పొందే వీలుంటుంది.
1. అకౌంట్ బ్యాలెన్స్ చెక్
ఎస్బీఐ ఖాతాదారులు వాట్సాప్ ద్వారా తమ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవచ్చు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
2. మినీ స్టేట్ మెంట్
ఎస్బీఐ ఖాతాదారులు తమ అకౌంట్ తో ఏదైనా లావాదేవీ నిర్వహించినప్పుడు, దానికి సంబంధించిన మినీ స్టేట్ మెంట్ ను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. చివరి రెండు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఎస్బీఐ వాట్సాప్ ద్వారా అందిస్తుంది.
3. పెన్షన్ స్లిప్ సర్వీస్
రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్ స్లిప్పులను ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా రూపొందించవచ్చు.
4. బ్యాంకింగ్ ఫారంలను పొందడం
డిపాజిట్ ఫారంలు, విత్ డ్రాయల్ ఫారంలు, తదితర బ్యాంకింగ్ సేవల ఫారంలను ఎస్బీఐ వాట్సాప్ బ్యాకింగ్ సర్వీస్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
5. డిపాజిట్ వివరాలు
సేవింగ్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ (ఆర్ డీ), ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీ), టర్మ్ డిపాజిట్ వివరాలను కూడా వాట్సాప్ లో చూసుకునేందుకు ఎస్బీఐ తన ఖాతాదారులకు వెసులుబాటు ఇస్తోంది.
6. లోన్ వివరాలు
హోమ్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, వంటి పలు రుణాలకు సంబంధించిన ఆప్షన్లను ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా అందిస్తోంది.
7. ఎస్బీఐ తాత్కాలిక అకౌంట్ తెరిచే సౌలభ్యం
ఎస్బీఐ తాత్కాలిక అకౌంట్ ను తెరిచేందుకు 18 ఏళ్లకు పైబడినవారు వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. ఈ తరహా ఖాతా తెరిచేందుకు అవసరమైన అర్హతలు, ఏ పత్రాలు సమర్పించాలి, ఈ ఖాతా ద్వారా వినియోగదారులు పొందే సౌలభ్యం వంటి వివరాలు వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
8. ఎన్నారై సర్వీసులు
విదేశాల్లో నివసించే ఎన్నారైలు ఎస్బీఐ వాట్సాప్ బ్యాకింగ్ ద్వారా ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు.
9. డెబిట్ కార్డు వాడకం వివరాలు
డెబిట్ కార్డు వినియోగానికి సంబంధించిన వివరాలు చెక్ చేయడంతో పాటు, గత లావాదేవీల వివరాలు, ఇతర వివరాలను వాట్సాప్ సాయంతో తెలుసుకోవచ్చు.
10. చోరీకి గురైన కార్డుల వివరాలు పొందే సదుపాయం
కార్డులు పోయినా, చోరీకి గురైనా వాటి వివరాలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు.
11. సమీపంలోని ఏటీఎం, బ్రాంచ్ ను గుర్తించే సౌకర్యం
మీరు ఉండే ప్రాంతానికి దగ్గర్లో ఏటీఎం ఎక్కడుంది, మీకు సమీపంలో బ్యాంకు బ్రాంచి ఎక్కడుంది అనే వివరాలను ఎస్బీఐ వాట్సాప్ సేవల్లో భాగంగా అందిస్తోంది.
12. ఫిర్యాదులు కూడా చేయొచ్చు
ఎస్బీఐ ఖాతాదారులు అధికారుల కాంటాక్ట్ వివరాలను పొందడమే కాదు, వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు, వినతులు కూడా చేయవచ్చు. తమ అకౌంట్ కు సంబంధించి ఇంకా అనేక పనులు చక్కబెట్టుకోవచ్చు.
13. వాట్సాప్ ద్వారా ప్రీ అప్రూవ్డ్ లోన్లకు సంబంధించిన వివరాలు
పర్సనల్, కార్, టు వీలర్… తదితర లోన్ల కోసం ముందస్తు ఆమోదం పొందడం (ప్రీ అప్రూవ్డ్), తదితర అంశాలను ఎస్బీఐ ఖాతాదారులు వాట్సాప్ లోనే చెక్ చేసుకోవచ్చు.