NRI-NRT

కెనడాని ఒక్కరోజులోనే ముంచెత్తిన అమెరికా హెచ్‌-1బీ వీసాదారులు

కెనడాని ఒక్కరోజులోనే ముంచెత్తిన అమెరికా హెచ్‌-1బీ వీసాదారులు

నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా.. అమెరికా (USA)లో పనిచేస్తున్న హెచ్‌-1బీ వీసాదారుల (H-1B Visa) కోసం కెనడా (Canada) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్కీమ్‌కు విశేష ఆదరణ లభించింది. ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి రోజునే దరఖాస్తులు ప్రభుత్వం విధించిన పరిమితి చేరుకున్నాయి. దీంతో ఈ స్కీమ్ ముగిసిందని, కొత్త దరఖాస్తులను తీసుకోవడం లేదని కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల సంస్థ (IRCC) తాజాగా ప్రకటించింది.

‘‘అమెరికాలోని కంపెనీల హై-టెక్‌ విభాగాల్లో ఎన్నో వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో హెచ్‌1-బీ వీసాతో అక్కడ పనిచేస్తున్న వారు మూడేళ్లపాటు తమ దేశంలో పని చేసుకునేందుకు (Work Permit) జులై 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని కెనడా (Canada) ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త స్కీమ్‌ ఏడాది పాటు లేదా 10 వేల దరఖాస్తులను స్వీకరించే వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది.అయితే, జులై 16న స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. జులై 17వ తేదీ నాటికే 10వేల దరఖాస్తులు వచ్చినట్లు ఐఆర్‌సీసీ గురువారం వెల్లడించింది. ‘‘హెచ్‌-1బీ వీసాదారుల (H-1B Visa) కోసం తాత్కాలికంగా తీసుకొచ్చిన పబ్లిక్‌ పాలసీ ముగిసింది. ఇది గరిష్ఠ పరిమితిని చేరుకోవడంతో కొత్త దరఖాస్తులను తీసుకోవడం లేదు’’ అని తెలిపింది.

దరఖాస్తు అనంతరం అనుమతి పొందిన వారు కెనడాలో ఏ ప్రాంతంలోనైనా, ఏ సంస్థలోనైనా ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వారి కుటుంబ సభ్యులు ఉద్యోగం లేదా చదువు కోసం తాత్కాలిక వీసాకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే, ఈ స్కీమ్‌ను మళ్లీ అందుబాటులోకి తెస్తారా? కేవలం ఈ 10వేల మందికే అవకాశం కల్పిస్తారా? అన్నదానిపై కెనడా ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. అయితే ఏ కారణం చేతనైనా దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. అప్పుడు కొత్త వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తారా? లేదా? అన్నది కూడా కెనడా స్పష్టంగా చెప్పలేదు.