అనారోగ్యం బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్పత్రుల చుట్టు తిరగకుండానే కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు ఉంటుంది. ఇప్పుడున్న జీవనవిధానంలో మనిషి వివిధ రకాల ఒత్తిడులకు లోనవుతున్నాడు. ఆయుర్వేద ఔషధాలలో తులసిని విరివిగా వినియోగిస్తారు. అందుకే తులసిని క్వీన్ ఆఫ్ హెర్బ్స్ గా పిలుస్తారు. 2వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంధం చరక సంహితతోపాటు, రుగ్వేదంలోను తులసి గురించిన ప్రస్తావన ఉంది. తులసిలో ఎ, సి విటమిన్లు, కాల్షియం, ఐరన్, క్లోరోఫిల్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంతవరకు తులసి శారీరక ఆరోగ్యానికి మేలుచేసే ఔషధంగా మాత్రమే మనందరికీ తెలుసు. తులసి గురించిన మరొక రహస్యం వెలుగులోకి వచ్చింది. తులసి మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచే అడాప్టోజెన్‌ను కలిగి ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మానసిక ఆందోళనను తగ్గించటానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
అధ్యయనాల ప్రకారం..ది క్లినికల్ ఎఫికెసి అండ్ సేఫ్టీ ఆఫ్ తులసి ఇన్ హ్యూమన్స్ గతంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. పర్యావరణం కారణంగా ఒత్తిడులకు గురైనప్పుడు తులసి సహనాన్ని పెంచడానికి సహాయపడుతుందని వెల్లడించింది. నిద్ర, మతిమరుపు, లైంగిక సంబంధిత సమస్యలకు కూడా దివ్యౌషధంగా పనిచేస్తుందని నివేదికలో తెల్పింది. దీంతోతోపాటు ది జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రకారం.. తులసిలో యాంటీడిప్రెషన్, యాంటీ యాంగ్జైటీ కారకాలు కనుగొంది. ప్రతి రోజూ 5 వందల మిల్లీ గ్రాముల తులసి ఆకుల రసాన్ని తాగినవారిలో ఒత్తిడి గణనీయంగా తగ్గినట్లు అధ్యయనం ద్వారా నిరూపితమైంది. మానసిక స్థితిని మెరుగుపరిచే న్యూరో కాగ్నిటివ్ ప్రభావాలను తులసి చూపగినట్లు పీర్-రివ్యూడ్ జర్నల్ లో ప్రచురించిన ఎవిడెన్స్-బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అధ్యయనం తేల్చింది.
తులసి ఆకులతో టీ..యోగా చేస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుందని చాలా మంది సూచిస్తుంటారు. తులసిని టీగా తాగడం వల్ల యోగా వల్ల ఎలాంటి ప్రశాంతత సమకూరుతుందో దీని వల్ల అదే ఫలితం వస్తుందట. తులసి టీలో కెఫిన్ ఉండనందున శరీరాన్ని ప్రశాంతంగా ఉంచేలా దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన శరీరంలో ప్రతి ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కార్టిసాల్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. కార్టిసాల్ ను స్ట్రెస్ హార్మోన్ సమత్యులతకు తులసి బాగా పనిచేస్తుంది. రాత్రి ప్రశాంతంగా నిద్రించేందుకు తులసి సహాయకారిగా చెప్పవచ్చు.