Business

ఆర్టీసీకి మరో 1500 కొత్త బస్సులు

ఆర్టీసీకి మరో 1500 కొత్త బస్సులు

ఆర్టీసీకి త్వరలోనే 1500 డీజిల్‌ బస్సులు రాబోతున్నాయని ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.తిరుమలరావు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ డిపోలోని ఉద్యోగులతో ఆయన సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా మెరుగైన పనితీరు కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పోలీస్‌ శాఖ కంటే ఆర్టీసీ కండక్టర్‌, డ్రైవర్లు అత్యంత ఒత్తిడితో పని చేయాల్సి ఉందన్నారు. కొవిడ్‌తో 324 మంది కండక్టర్‌, డ్రైవర్లు మృత్యువాత పడ్డారని తెలిపారు. నర్సరావుపేట, అలిపిరితో పాటు మరో చోట డిస్పెన్సరీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈహెచ్‌ఎస్‌ను ఇంకా మెరుగుపరచనున్నామని చెప్పారు. ఇప్పటివరకు 884 కారుణ్య నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు. అంతర్రాష్ట్ర బస్‌ సర్వీసులకు సంబంధించి ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని, త్వరలో గెజిట్‌ రాబోతుందని తెలిపారు. త్వరలో ఒడిశా ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకోనున్నామన్నారు. దేశంలోనే అత్యంత పొడవైన బస్సును నడిపేందుకు, వెయ్యి ఎలక్ర్టికల్‌ బస్సులకు ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించి పాత బకాయిలన్నీ తీర్చినట్లు చెప్పారు. ఆర్పీఎస్‌ కింద రూ.500 కోట్లు అప్పు ఉందన్నారు. ప్రమోషన్ల విషయంలో పాతవిధానాన్నే అనుసరి స్తామని తెలిపారు. ఆక్యుపెన్సీని పెంచాలని, ఖర్చు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఏఎస్పీ సునీల్‌శ్రీచరణ్‌, ఆర్‌ఎం. అప్పలరాజు, డిపో మేనేజర్‌ బాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.