* హైదరాబాద్‌లో దారుణం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. వర్షంలో రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లుతున్న ఓ మహిళ పై దుండగుడు కన్నేశాడు. కారులో లిఫ్ట్ ఇచ్చి అదే కారులో అత్యాచారం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్ పరిధిలో చోటుచేసుకుంది.మధురానగర్‌లో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లుతుండగా.. ఓ కారు అటు వైపుగా వచ్చింది. ఆమె లిఫ్ట్ అడగకున్నా.. ఆ డ్రైవర్ కారు ఆపి లిఫ్ట్ ఆఫర్ చేశాడు. ఏం అక్కర్లేదని ఆమె చెప్పినా.. భరోసాగా మాట్లాడి ఆమెను కన్విన్స్ చేశాడు. భయపడకండీ.. వర్షం ఎక్కువగా పడుతున్నదని, ఇలాగే వెళ్లితే తడిసిపోతావని ఆ దుండగుడు ఆమెను నమ్మబలికాడు. దీంతో ఆ మహిళ కారు డ్రైవర్‌ను విశ్వసించింది.అనంతరం, ఆమె కారులో వెనుక సీటులో కూర్చోవడానికి ఆమె వెళ్లింది. కానీ, డ్రైవర్ వారించాడు. వెనుక సీటులో వద్దని, ముందు సీటులో కూర్చోవాలని సూచించాడు. అయితే, ఆ కారును ఆమె అనుకున్న దారిలో కాకుండా మరో మార్గానికి మళ్లించాడు. దీంతో ఆ మహిళ అనుమానంతో డ్రైవర్‌ను అడిగింది. సమాధానం ఇవ్వలేదు డ్రైవర్. దీంతో అనుమానంతో ఆ మహిళ అరుపులు వేసింది. అరిస్తే చంపేస్తానని ఆ డ్రైవర్ బెదిరించాడు. ఆ తర్వాత ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి కారులో నుంచి బయటికి తోసేశాడు. ఆమె దయనీయ స్థితిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
* జూబ్లీహిల్స్ 10 లక్షల దోపిడీ దొంగ ఆత్మహత్య
జూన్ నెలలో జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లోకి చొరబడి గర్భిణిని బెదిరించి రూ.10 లక్షలు తీసుకెళ్లిన నిందితుడు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాజేష్ శుక్రవారం (జులై 21న) ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం కేసులో గతంలో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చాడు. తనను పోలీసులు అరెస్ట్ చేశారనే అవమానభారంతో రాజేష్ అత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. జూన్ నెలలో జూబ్లీహిల్స్ లోని ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డ రాజేష్ యాదవ్.. ఆ ఇంట్లో ఉన్న గర్భిణీని కత్తితో బెదిరించాడు. దాదాపు 6 గంటల పాటు ఆమెను ఇంట్లోనే నిర్బంధించి.. రూ.10 లక్షలు పట్టుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితుడు రాజేష్ అని గుర్తించి.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మూడు రోజులుగా అవమాన భారంతో కుమిలిపోయాడు రాజేష్. ఈ క్రమంలోనే ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు.
* 3 ఏళ్ల కొడుకుని చంపేందుకు ప్లాన్ చేసిన తల్లి
అమెరికాలో ఓ తల్లి తన సొంత కుమారుడిని చంపేందుకు కిల్లర్ ను నియమించుకుంది. ఫ్లోరిడాలోని మయామిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువతి తన మూడేళ్ల కొడుకును చంపడానికి ప్రయత్నించింది. ఆ చిన్నారిని చంపించడానికి ఆ మహిళ హిట్ ఫర్ హైర్ వెబ్‌సైట్‌కి వెళ్లి కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నించింది. ఈ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వాస్తవానికి మయామి మొదట తన బిడ్డను చంపేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వకపోవడంతో.. తన పిల్లాడిని చంపడానికి ఒక కిల్లర్ ను ఎంచుకుంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన 18 ఏళ్ల తల్లిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఆమె తన నేరాన్ని అంగీకరించింది. తన కుమారుడిని చాలా దూరం, దూరంగా తీసుకెళ్లి… వీలైనంత త్వరగా చంపేయాలని తాను కోరుతున్నానని ఆ మహిళ కోర్టుకు తెలిపింది. ఇందుకోసం మూడు వేల డాలర్లు చెల్లించేందుకు ఆ మహిళ సిద్ధంగా ఉన్నట్లు మియామీ పోలీసులు తెలిపారు.
* కొత్త ప్రియుడి కోసం పాత ప్రియుడ్ని పాముకాటుతో చంపించిన యువతి
ఓ వ్యక్తి కారులో మరణించాడు.కారు డోర్లు మూసుకుపోయి ఊపిరి ఆడక మరణించాడని అనుకున్నారు. కానీ కాళ్లపై పాము కాట్లు కనిపించటంతో అసలు విషయం గురించి ఆరా తీయగా షాక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. ఓయువతీ, యువకుడు అతని మరణానికి కారణమని తెలుసుకున్న పోలీసులే షాక్ అయ్యారు. ఓ యువతి తన పాత ప్రియుడ్ని వదిలించుకోవటానికి కొత్త ప్రియుడితో పారిపోవటానికి వేసిన పక్కా ప్లాన్ లో భాగంగా పాత ప్రియుడ్ని పాముతో కరిపించిం చంపించిన ఘటన ఉత్తరాఖండ్ లో వెలుగులోకి వచ్చింది.జులై 15న నైనిటాల్ ప్రాంతంలోని హల్ద్వానీ పోలీసులు ఓ కారులో ఓ మృతదేహాన్ని గుర్తించారు. ఆ వ్యక్తి అంకిత్ చౌహాన్ అనే వ్యాపారవేత్తగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతను కారు ఏసీ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వల్లచనిపోయాడని భావించారు. కానీ పోస్టుమార్టంలో అంకిత్ చౌహాన్ కాళ్లపై పాము కాట్లు కనిపించటం పాముకాటువల్లే అతను చనిపోయాడని తెలిసి షాక్ అయ్యారు. దీంతో అతను మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఓ యువతి జాడ తెలిసింది.దీంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
* మణిపూర్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ నోటీస్
మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మణిపూర్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర పోలీసు చీఫ్‌కు నోటీసులు జారీ చేసింది. ‘‘ఇలాంటి అనాగరిక సంఘటనల నుంచి పౌరులు, ముఖ్యంగా మహిళలు, సమాజంలోని బలహీన వర్గాల మానవ హక్కులను కాపాడటానికి తీసుకున్న చర్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం’’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (National Human Rights Commission) ఒక ప్రకటనలో పేర్కొంది.మే 4వతేదీన మణిపూర్ రాష్ట్రంలోని కాంగ్ పోక్పి జిల్లా బి ఫైనోమ్ గ్రామంలో ఒక గిరిజన కుటుంబానికి చెందిన ఐదుగురిని పోలీసు కస్టడీ నుంచి తీసుకువెళ్లిన ఘటనపై తక్షణం జోక్యం కల్పించుకోవాలని హెచ్ఆర్‌సీ కోరింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, (women being paraded naked) వారిలో ఒకరిపై సామూహిక అత్యాచారం చేసి, ఆ కుటుంబంలోని ఇద్దరు పురుషులను హత్య చేశారని మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో పోరాడుతున్న ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు దుండగులు నగ్నంగా ఊరేగిస్తున్నట్లు చూపుతున్న వీడియో బుధవారం ఆన్‌లైన్‌లో కనిపించడంతో మణిపూర్ కొండల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ దారుణ ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ ఈశాన్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు హెచ్ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది.
* బస్సు టైర్ కింద తల పెట్టిన మహిళ
జగిత్యాలలో ఓ మహిళ ఆర్టీసీ బస్సు టైర్ కింద టైర్ పెట్టింది. అయితే డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు ఏం జరిగిందంటే.. మెట్ పల్లి నుంచి జగిత్యాలకు ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరడానికి సిద్ధమైంది. అయితే ఈ క్రమంలోనే ఓ మహిళ అకస్మాత్తుగా బస్సు వెనుక టైర్ కు కొంత దూరంలో కిందపడింది. ఇంతలోనే బస్సు బయలుదేరింది. అయితే వెనుక బస్సు టైర్ ఆమె తల దగ్గరికి రాగానే గమనించిన ప్రయాణికులు కేకలు వేశారు. వెంటనే డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది.
* బెంగాల్‌లో మణిపూర్ తరహా ఘటన
మణిపూర్‌లో ఇద్దరు కుకీ తెగ మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతూనే ఉన్నది. ఇదే సందర్భంలో పశ్చిమ బెంగాల్‌లోనూ అలాంటి ఘటనే చోటుచేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో స్థానిక ఎన్నికలు జరుగుతుండగా బీజేపీకి చెందిన ఓ మహిళను వివస్త్రురాలు చేసి టీఎంసీ గూండాలు ఆమెను ఊరిలో ఊరేగించారని వార్తలు వస్తున్నాయి. జులై 8వ తేదీన టీఎంసీ గూండాలు ఈ హీనమైన పని చేశారని బీజేపీ ఆరోపణలు చేసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు ప్రకారం, హౌరా జిల్లాలో పంచ్లా ఏరియాలో సుమారు 40 మంది తృణమూల్ కాంగ్రెస్ గూండాలు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఈ దాడికి పాల్పడ్డారు. ‘కర్రతో నా ఛాతి, తలపై దాడి చేశారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు విసిరేశారు’ అని ఆమె పేర్కొన్నారు. ‘కొందరు నన్ను కొడుతూ ఉండగా అలీ షేక్, సుకమల్ పంజాలు నా చీర, లోదుస్తులను చించేయాలని హిమంత రాయ్ ప్రేరేపించాడు. ముందు వారు నాపై దాడి చేసి ఆ తర్వాత వివస్త్రను చేశారు. అందరి ముందు అసభ్యకరంగా బలవంతంగా నన్ను టచ్ చేశారు’ అని ఆ బాధితురాలు ఫిర్యాదు చేశారు.టీఎంసీకి చెందిన హిమంత రాయ్, నూర్ ఆలాం, అల్ఫీ ఎస్కే, రణబీర్ పంజా సంజు, సుకమల్ పంజాలను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
* ఢీకొట్టిన కారుపైనే ఎగిరిపడి వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి సమీపంలో జాతీయ రహదారి 363పై గురువారం అతివేగంగా వచ్చిన ఓ కారు పాదచారిని ఢీకొట్టింది. దీంతో బాధితుడు ఎగిరి అదే కారుపై పడి దుర్మరణం చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూరు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని.. మండలంలోని చౌటపల్లి పంచాయతీ పోచంపల్లికి చెందిన తాపీ మేస్త్రీ కొండ పోషం (50)గా గుర్తించారు. అతి వేగంగా పోషంను ఢీకొట్టిన కారు దాదాపు 150 మీటర్లు మేర వెళ్లి ఆగగా.. అప్పటికే ఆయన మృతి చెందారని ఎస్సై చెప్పారు.
* ప్రయాణికురాలిపై ఆటో డ్రైవర్ వక్రబుద్ధి
ఆటో డ్రైవర్ బారి నుంచి ఓ మహిళ చాకచక్యంగా తప్పించుకుంది. ఆటో నుంచి బయటకు దూకేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగింది.ఓ శుభకార్యానికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కింది. బాలాజీనగర్‌కు వెళ్లే దారిలో కాకుండా మరో రూట్‌లో ఆటోను డ్రైవర్ మళ్లించాడు. మహిళకు అనుమానం వచ్చి ఆటో డ్రైవర్‌ను ఇలా ఎక్కడికి అని ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. ఆటో డ్రైవర్ దారి మళ్లించడంతో పాటు, అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో ఆ మహిళ రన్నింగ్ ఆటో నుండి దూకేసింది. దీంతో ఆమె గాయాలపాలైంది. అయితే ఆటో డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. గాయాలపాలైన మహిళ దిశ SOSకు కాల్ చేసి జరిగిన సంఘటన గురించి పోలీసులకు వివరించింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు తీవ్ర గాయాలైన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ కోసం చుట్టుపక్కల పోలీసులు గాలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ నుండి ఆటో డ్రైవర్ వివరాలను పోలీసులు సేకరించారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను కేశవులుగా పోలీసులు గుర్తించారు. తప్పించుకున్న ఆటో డ్రైవర్ కేశవులు పై 366 సెక్షన్ కింద సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
* బాలికపై లైంగిక వేధింపులు
కొంతకాలంగా ఓ బాలికను లైంగికంగా వేధిస్తున్న వైకాపా నాయకురాలి కుమారుడిపై ఫిర్యాదు చేసినందుకు బాధిత కుటుంబంపై మూకుమ్మడి దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం చోటు చేసుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన బాధిత బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఒక సోదరుడు. తండ్రి లేకపోవడంతో దివ్యాంగురాలైన తల్లి గిల్ట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వారి ఇంటి సమీపంలోనే ఉండే వైకాపా నాయకురాలు శివకుమారి కుమారుడు మోహనకృష్ణ అలియాస్ పండు(22) నాలుగు నెలలుగా బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. కళాశాలకు వెళ్లే సమయంలోనూ అడ్డగిస్తుండటంతో బాలిక కళాశాలకు వెళ్లడం మానేసింది. దీంతో ఆ యువకుడిని తమ జోలికి రావద్దని కుటుంబసభ్యులు బతిమలాడారు. అయినా గోడదూకి ఇంట్లోకి ప్రవేశించి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఈనెల 17న పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అవతలిపక్షం వారితో గొడవ మంచిది కాదని, సర్దుబాటు చేసుకోవాలని సూచించి ఫిర్యాదు స్వీకరించకుండానే ఎస్సై పంపించివేశారు. అయినా పండు వేధింపులు ఆగలేదు. దీంతో బుధవారం రాత్రి మళ్లీ స్టేషన్‌కు వచ్చి బాలిక తల్లి, మేనమామ ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేస్తామని చెప్పారు.