Business

గోఫస్ట్‌ సేవలు ప్రారంభానికి DGCA ఆమోదం-TNI నేటి వాణిజ్య వార్తలు

గోఫస్ట్‌ సేవలు ప్రారంభానికి DGCA ఆమోదం-TNI నేటి వాణిజ్య వార్తలు

ఎస్‌బీఐ యోనోలో అదిరిపోయే అప్‌డేట్‌

భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్‌ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఎన్‌పీసీఐ ద్వారా తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్స్‌ కారణంగా ఖాతాదారులు చాలా సింపుల్‌గా డిజిటల్‌ చెల్లింపు చేస్తున్నారు. అలాగే యూపీఐ చెల్లింపులను సపోర్ట్‌ చేస్తూ వచ్చి చాలా యాప్స్‌ ప్రజాదరణ పొందాయి. అలాగే ఎస్‌బీఐ కూడా తన బ్యాంకింగ్‌ అవసరాల కోసం యోనో యాప్‌ను తీసుకువచ్చింది. అయితే ఇప్పటివరకూ యోనో నుంచి చెల్లింపులు చేయాలంటే కేవలం ఎస్‌బీఐ ఖాతాదారులకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం నాన్‌ ఎస్‌బీఐ ఖాతాదారులు కూడా యోనోను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది ఎస్‌బీఐయేతర కస్టమర్‌లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మోడ్‌ని ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు చేయడానికి యోనో అప్లికేషన్‌ను అప్‌డేట్‌ చేసింది. ఇకపై, వినియోగదారులు ఏదైనా క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. అలాగే, వినియోగదారులు వారి పరిచయాలకు డబ్బు పంపవచ్చు. ఖాతాల మధ్య నిధులను బదిలీ చేయవచ్చు, ఫోన్ నంబర్‌లకు డబ్బు పంపవచ్చు. ఇతరుల నుంచి డబ్బును అభ్యర్థించవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఎస్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఎస్‌బీఐ తన యూజర్ బేస్ పెంచుకుంటుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యోనో యాప్ మొత్తం డౌన్‌లోడ్‌ల సంఖ్య కూడా పెరుగుతుంది.

పర్సనల్ లోన్‌కి అప్లై చేస్తున్నారా

డబ్బు అవసరం ఏ విధంగా వస్తుందో ఎవ్వరికి తెలియదు. అత్యవసర సమయంలో మాత్రం అందరికి గుర్తుకువచ్చేది పర్సనల్‌ లోన్‌ మాత్రమే. ఇది చాలా తక్కువ సమయంలో అయిపోతుంది. పర్సనల్‌ లోన్స్‌ సాధారణంగా వివాహం లేదా పుట్టిన రోజు వేడుకలకి, ఇల్లు లేదా కారు కొనడం కోసం, ముందస్తు చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు తీర్చడానికి ఉపయోగిస్తారు. అయితే పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి పర్సనల్ లోన్ పర్సనల్‌ లోన్‌ అనేది మీ క్రెడిట్‌ స్కోరుపై ఆధారపడి ఉంటుంది. ఇవి అసురక్షిత రుణాల కిందికి వస్తాయి కాబట్టి రుణదాతకు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఫలితంగా క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండే దరఖాస్తుదారులకు మాత్రమే అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే ఇది రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుకి పర్సనల్‌ లోన్‌ లభిస్తుంది. వడ్డీ రేట్లను సరిపోల్చండి పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఎలాంటి వడ్డీరేట్లు ఉన్నాయో గమనించాలి. ఎందుకంటే వడ్డీరేట్లు అనేవి వివిధ బ్యాంకులలో వివిధ రకాలుగా ఉంటాయి. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉంటుందో అక్కడ తీసుకుంటే సరిపోతుంది. అయితే లోన్ తీసుకునే ముందు మీ అవసరం సరైనదేనా కాదా అని ఒకసారి బేరిజు వేసుకోవాలి. మీరు తీసుకుంటున్న లోన్‌ డబ్బు మీ అవసరాలను తీరుస్తుందో లేదో గమనించాలి. పూర్తిగా నిర్థారించుకున్నాక లోన్‌ తీసుకోవాలి.

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

గత కొన్ని సెషన్లుగా లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 887 పాయింట్లు నష్టపోయి 66,684కి పడిపోయింది. నిఫ్టీ 234 పాయింట్లు కోల్పోయి 19,745కి దిగజారింది. టెక్, ఐటీ, ఫైనాన్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి.

 టెక్‌ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌

యాపిల్‌ విడుదల చేసే ఐఫోన్‌ (iPhones) మోడల్స్‌ విడుదలకు ముందే మార్కెట్‌లో ఓ ట్రెండ్‌ను సెట్‌ చేస్తుంటాయి. వాటి ధర, ఫీచర్ల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఐఫోన్‌ లేటెస్ట్‌ మోడల్‌ ఎప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురుచూసే టెక్‌ ప్రియులూ ఉంటారు. అలాంటి ఐఫోన్‌ లవర్స్‌కు ఇది కాస్త బ్యాడ్‌న్యూస్‌. ఎందుకంటే యాపిల్ తన ఐఫోన్‌ 15 (iPhone 15) సిరీస్‌ మొబైల్‌ను మార్కెట్‌లోకి ఆలస్యంగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏటా సెప్టెంబర్‌లో కొత్త మోడల్‌ను యాపిల్‌ విడుదల చేస్తుంది. ఈ ఏడాదిలో ఐఫోన్ 15 సిరీస్‌ లాంచ్ మాత్రం కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌కు బదులు అక్టోబర్‌లో ఈ ఫోన్‌ను యాపిల్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విడుదల సమయానికి ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండకపోవడమే దీని కారణమని తెలుస్తోంది. యాపిల్‌ ప్రో మోడళ్లలో వినియోగించే డిస్‌ప్లేలు తయారుచేసే సంస్థలు కొత్త మానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ను అనుసరిస్తున్నాయి. దీనికి తోడు డిస్‌ప్లేను అందించాల్సిన ఎల్‌జీ సంస్థ డిస్‌ప్లే టెస్టింగ్‌లో అంతరాయం ఎదుర్కొంటుండటంతో విడుదల ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. 2020లో కొవిడ్‌ మహమ్మరి విజృంభణ కారణంగా ఐఫోన్ 12 సిరీస్‌ విడుదల్లో ఇలానే అంతరాయం ఏర్పడింది. ఐఫోన్‌ 15 సిరీస్‌లో ఐఫోన్‌ ప్రో మోడళ్లతో పాటు ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడళ్లను యాపిల్‌ తీసుకొస్తోంది.

మహిళల కోసం అద్భుతమైన స్కీమ్

మహిళలకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఏకంగా రెండు లక్షలు పొందవచ్చు. కేంద్రప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడానికి ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. అందులో మహిళా సమ్మాన్ స్కీం ఒకటి. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచే పోస్టాఫీసుల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం. దీని ద్వారా మహిళలు గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి 7.5శాతం వడ్డీరేట్ వస్తుంది

*  ఆ పథకంలో పెట్టుబడితో పన్ను మినహాయింపులు

నేషనల్‌ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్‌) అనేది ఒకరి పదవీ విరమణను పొందేందుకు, ఏకకాలంలో పన్ను ప్రయోజనాలను పొందేందుకు అత్యంత గౌరవనీయమైన పద్ధతి. ఇది ముఖ్యమైన పన్ను-పొదుపు అవకాశాలను అందించడంతోపాటు వారి భవిష్యత్తును కాపాడుకోవడానికి వ్యక్తులకు నమ్మకమైన మార్గాలను అందిస్తుంది. ఇప్పటివరకూ సుమారు 13,000 కార్పొరేట్‌ కంపెనీలు ఈ పథకంతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ ఇప్పటివరకు పరిమిత సంఖ్యలో ఉద్యోగులు మాత్రమే నమోదు చేసుకున్నారు.  ముఖ్యంగా ఎన్‌పీఎస్‌ రెండు విధానాలను అందిస్తుంది. ముందుగా ఆల్ సిటిజన్స్ మోడల్ ఉంది. ఇది 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులను ఎన్‌పీఎస్‌ని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. రెండో పద్ధతిలో ఎన్‌పీఎస్‌ని ఉద్యోగిగా తీసుకోవడం. ఎన్‌పీఎస్‌ను ఉద్యోగిగా ఎంచుకోవడం ద్వారా వ్యక్తులు పాత పన్ను విధానంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపుల నుండి ప్రయోజనం పొందవచ్చు. 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. అయితే ఎన్‌పీఎస్‌తో సెక్షన్ 80 సీసీడీ (1) ప్రకారం ఉద్యోగులు వారి జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 10 శాతం వరకు విరాళాలపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అదనంగా సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు ప్రత్యేక పన్ను ప్రయోజనం ఉంది. అయితే కంపెనీ ఎన్‌పీఎస్‌ సహకారం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) నుంచి వేరుగా ఉంటుంది. కంపెనీ పాలసీల ప్రకారం ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్‌కు కంట్రిబ్యూట్ చేయడం కొనసాగించాలి. ఎన్‌పీఎస్‌కు సహకారం అందించాలనే నిర్ణయం పూర్తిగా కంపెనీ అభీష్టానుసారం, ఉద్యోగి కాస్ట్ టు కంపెనీ (సీటీసీ)లో భాగంగా ఉంటుంది. ఒక కంపెనీ తన ఉద్యోగుల ఎన్‌పిఎస్‌కి విరాళమివ్వాలని ఎంచుకున్నప్పుడు ఈ విరాళాలు జీతం నిర్మాణంలో ఉంటాయి. అయితే ఎన్‌పీఎస్‌లో నమోదు చేసుకోవడం అంతిమంగా ఉద్యోగి ఎంపిక.

బ్యూటీ ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టిన దమానీ

 డీ-మార్ట్ బ్రాండుతో హైపర్ స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ తాజాగా బ్యూటీ ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టారు. బెంగళూరుకు చెందిన బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రిటైల్ చెయిన్ ‘హెల్త్ అండ్ గ్లో’ కంపెనీని రూ. 700-750 కోట్లకు కొనేందుకు రాజన్ రహేజా, హేమేంద్ర కొఠారిలతో దమానీ ఒప్పందం చేసుకున్నట్టు ఎకనమిక్ టైమ్స్ శుక్రవారం వెల్లడించింది.2015లో బాబే స్వదేశీ స్టోర్స్ కొనుగోలు తర్వాత రాధాకిషన్ దమానికి ఇదే అతిపెద్ద ఒప్పందం కావడం గమనార్హం. హెల్త్ అండ్ గ్లో 1997లో తన మొదటి రిటైల్ స్టోర్‌ను చెన్నైలో ఏర్పాటు చేసింది. అనంతరం హైదరాబాద్, బెంగళూరు, పూణె సహా దేశవ్యాప్తంగా 175 స్టోర్లను కలిగి ఉంది.ప్రస్తుతం రాధాకిషన్ దమానీ సంపద విలువ రూ. 1.67 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది జూన్ త్రైమాసికం నాటికి ఆయన 14 కంపెనీల షేర్లలో పెట్టుబడులను కలిగి ఉన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ యూరోమానిటర్ ఇంటర్నేషన్ ప్రకారం, 2023, చివరి నాటికి భారత బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ సుమారు రూ. 1.50 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.

గోఫస్ట్‌ సేవలు ప్రారంభానికి DGCA ఆమోదం

దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌ (Go first) కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 15 విమానాలతో రోజుకు 114 సర్వీసులు నడుపుకొనేందుకు అవకాశం కల్పించింది. కొన్ని షరతులతో ఈ అనుమతులు మంజూరు చేసింది.వాడియా గ్రూప్‌నకు చెందిన గోఫస్ట్‌ విమానయాన సంస్థ నిధుల కొరతతో సర్వీసులు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. మే 3 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు గోఫస్ట్‌ పునరుద్ధరణ ప్రణాళికను డీజీసీఏకు సమర్పించింది. దీనికి డీజీసీఏ ఆమోదం తెలిపింది.అయితే, దిల్లీ హైకోర్టు, దిల్లీ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లు/దరఖాస్తులకు సంబంధించిన తీర్పులకు లోబడి ఈ అనుమతులు ఉంటాయని డీజీసీఏ పేర్కొంది. అలాగే, నియంత్రణ సంస్థ నిబంధనలను అనుసరించాలని గోఫస్ట్‌కు సూచించింది. నిధుల లభ్యత మేర షెడ్యూల్ చేసిన విమానాలను తిరిగి ప్రారంభించవచ్చని డీజీసీఏ పేర్కొంది. జూన్‌ 28న గోఫస్ట్‌ దివాలా పరిష్కారకర్త ఈ ప్రణాళికను డీజీసీఏ ముందుంచగా.. దీనిపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించిన అనంతరం పునః ప్రారంభానికి ఆమోదం తెలిపింది.

పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడితో అధిక వడ్డీ

గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు పెట్టుబడులపై వడ్డీ రేట్లను గణనీయంగా పెంచాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్‌ పోస్ట్స్‌ కూడా పెట్టుబడిపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. భారత ప్రభుత్వం పోస్టాఫీసు డిపాజిట్ పథకాలకు కాలానుగుణంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. కచ్చితంగా ఇండియా పోస్ట్ అందించే ఈ పెట్టుబడి ప్రణాళికలు హామీతో కూడిన రాబడితో వస్తాయి. అలాగే ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటాయి. పోస్టాఫీసు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 6.80 శాతం నుంచి 7.50  శాతం వరకూ ఉంటాయి. అలాగే పెట్టుబడిపై స్థిరమైన వృద్ధిని అందిస్తాయి. నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం, ఇండియా పోస్ట్ అందించే ఈ పథకాలను నిర్వహిస్తుంది. కాబట్టివ పెట్టుబడి నమ్మకమైన రాబడి కోసం పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. పోస్టాఫీసలులో అందుబాటులో ఉన్న వివిధ పథకాల గురించి ఓ సారి తెలుసుకుందాం. ఈ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా సంవత్సరానికి 4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే దీని ద్వారా వచ్చే వడ్డీ పూర్తిగా పన్ను విధించదగినదని గుర్తుంచుకోండి, అలాగే టీడీఎస్‌ క్లెయిన్‌ చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఐదు సంవత్సరాల స్థిర వ్యవధితో మీరు రూ. 100 నుంచి నెలవారీ డిపాజిట్లు చేయవచ్చు. అలాగే ఈ పథకంలో వడ్డీని త్రైమాసికానికి కలిపి 6.5 శాతం చొప్పున వడ్డీని పొందవచ్చు.

టెలికాంతో పాటు ఫైబర్‌సేవలు

ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) తమ కస్టమర్ల కోసం కొత్తగా వీఐ వన్‌ (Vi One) సర్వీసులను ప్రారంభించింది. వీఐ వన్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్లతో ఫైబర్‌ సేవలు, ఓటీటీలతో పాటు ప్రీపెయిడ్‌ మొబైల్‌ సేవలను కూడా అందించనుంది.  గతంలో భారతీ ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ ఎయిర్‌టెల్‌ పేరుతో ఇటువంటి సేవలనే తీసుకొచ్చింది. వీఐ వన్‌ సర్వీసులతో వొడాఫోన్‌ ఐడియా సైతం నాలుగు ప్లాన్లను తమ యూజర్లకు పరిచయం చేసింది.