సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణకు నాట్స్ చేస్తున్న కృషి ప్రశంసనీయం
కూచిపూడి గొప్పతనాన్ని భావితరాలకు చాటి చెప్పేందుకు సంస్కృతి ప్రియులంతా కలిసి పనిచేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ సాంస్కృతిక విభాగ అధిపతి
డా. జొన్నలగడ్డ అనురాధ అన్నారు. నాట్స్ లలిత కళా వేదిక నిర్వహించిన ఆన్లైన్ సదస్సు నర్తనశాలలో పాల్గొని ప్రసంగించారు. తెలుగువారికి ప్రత్యేకమైన కూచిపూడికి మరింత వైభవం తెచ్చేందుకు సాంస్కృతిక సంస్థలు కృషి చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల కంటే ఇప్పుడు అమెరికాలోనే ఎక్కువగా మన తెలుగువారితో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కూచిపూడి నేర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు.. గతంలో చాలామంది నృత్య గురువులు కూచిపూడిని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి.. దానికి మరింత ప్రాచుర్యం కల్పించారన్నారు.. తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను జొన్నలగడ్డ అనురాధ ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి వివరించారు. నర్తనశాల కార్యక్రమానికి వ్యాఖ్యతగా కిభశ్రీ వ్యవహారించారు. నర్తనశాల వెబినార్ ద్వారా నృత్యం గురించి ఎన్నో అమూల్యమైన విషయాలను వివరించిన జొన్నలగడ్డ అనురాధ కి నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.