WorldWonders

దుబాయ్ నుండి కూతురిని టమాటాలు తీసుకురమ్మన్న తల్లి

దుబాయ్ నుండి కూతురిని టమాటాలు తీసుకురామన్న తల్లి

మనోళ్లు ఎవరైనా విదేశాల్లో ఉండి.. సెలవులపై స్వదేశానికి వస్తున్నారంటే.. మనల్ని ఏవైనా గిఫ్టులు తీసుకురావాలా? అని అడుగుతారు. దాంతో మనం కూడా ఏదో చెప్పడం, వారు తీసుకురావడం కామన్. ఇదిగో ఇలాగే దుబాయిలో ఉండే ఓ కూతురు ఇండియాకు వస్తున్న క్రమంలో తన తల్లితో ఏదైనా గిఫ్ట్ తీసుకురావాలా? అని అడిగింది. దాంతో ఆ తల్లి అడిగిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఏముంటది ఏదో విలువైన వస్తువు తీసుకురమ్మని చెప్పి ఉంటది అని అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఆమె కూతురిని అడిగిన గిఫ్ట్.. 10కిలోల టమాటా తీసుకురమ్మంది. దాంతో ఆ కూతురు కూడా తల్లి కోరికను మన్నించి దుబాయి నుంచి ఇండియాకు 10 కిలోల టామాటలు పట్టుకువచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోదరి ట్వీట్ చేయడంతో బయటకు వచ్చింది. దాంతో ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఇండియాలో టమాటా ధరలు భారీగా పెరిగాకా విచిత్రమైన కథనాలు వైరల్ అవుతున్నాయి. టమాటాల దొంగతనాల దగ్గర్నుంచి రీల్స్, వీడియోలు ఫుల్ హంగామా నడుస్తోంది. అయితే దుబాయ్‌లో ఉంటున్న తన సోదరి ఇండియా వస్తున్న సందర్భంలో తన తల్లి అడిగిన వింత కానుకను @Full_Meals అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో షేర్ చేసింది. ‘మా సోదరి తన పిల్లల వేసవి సెలవుల కోసం దుబాయ్ నుంచి ఇండియాకి వస్తోంది.. దుబాయ్ నుంచి ఏమైనా కావాలా? అని మా అమ్మను అడిగినపుడు ఆమె 10 కిలోల టమాటాలు తీసుకురండి అని చెప్పారు. తను నిజంగానే 10 కేజీల టమాటాలను ప్యాక్ చేసి పంపింది.. నేనేమంటానంటే…’ అనే శీర్షికతో పోస్ట్ చేసింది.ఇక టమాటాలు ఇండియాకు వచ్చేసాయని ఆమె తరువాత ట్వీట్‌లో స్పష్టం చేసింది. తన తల్లి టమాటాలను ఊరగాయ లేదా పచ్చడి పెడుతుందని ట్విట్టర్ యూజర్ వెల్లడించింది. ఇటీవల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణంగా కేజీ 20 రూపాయిలు  ఉన్న టమాటా ధర కాస్తా 250 రూపాయిల  వరకూ చేరింది. ఇండియన్స్… విదేశాల్లో ఉన్న తమ వారి నుంచి టమాటాలను బహుమతిగా తీసుకురమ్మని అడిగే స్ధాయి వరకూ టమాటాల ధరలు చేరుకున్నాయి. ఇక సామాన్యులు మాత్రం పెరుగుతున్న టమాటా ధరలు చూసి లబోదిబో అంటున్నారు.