NRI-NRT

అమెరికాలో ప్రవాసులను దోపిడీ చేస్తున్న “బియ్యం కష్టాలు”

అమెరికాలో ప్రవాసులను దోపిడీ చేస్తున్న “బియ్యం కష్టాలు”

“ఎంకి పెళ్లి సుబ్బి చావుకు” వచ్చిన చందంగా తయారైంది అమెరికాలో ప్రవాస భారతీయుల పరిస్థితి. భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై విధించిన నిషేధ ప్రభావం అమెరికాలోని ప్రవాసులపై తీవ్రంగా పడింది. శుక్రవారం నాడు ఈ పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రవాసులు అధికంగా ఉండే బే-ఏరియా, న్యూజెర్సీ, డల్లాస్ వంటి ప్రాంతాల్లో భారతీయ దుకాణాలు అధిక ధరలకు బియ్యాన్ని విక్రయిస్తున్నారు. $25 డాలర్ల 10కిలోల బియ్యాన్ని $50 డాలర్లకు అమ్ముతున్నారు.

డల్లాస్‌లో భారతీయ సరుకులు అమ్మే దుకాణదారులు IIT పరీక్షల్లో మాదిరి లాజిక్కులు విధిస్తున్నారు. శుక్రవారం ఉదయం వరకు ఏ రకమైన బియ్యం అయినా ఒక సంచి కొనుగోలుకు అనుమతినిచ్చిన దుకాణుదారులు, మధ్యాహ్నానికి $35 డాలర్లు బిల్లు చేస్తేనే బియ్యం కొనుగోలుకు అనుమతిస్తామని అది కూడా కేవలం ఒక్క సంచి మాత్రమేనని చెప్పడం కొనుగోలుదారులను విస్మయానికి గురిచేసింది. ఇండియా బజార్, పటేల్ బ్రదర్స్, సబ్జీ మండి వద్ద భారతీయులు కిక్కిరిసి ఉన్నారు. సామ్స్, కోస్కో వంటి అమెరికన్ దుకాణాల్లో సైతం బియ్యం కొనుగోలుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

ఇదిలా ఉండగా కొందరు ప్రవాసులు బియ్యం మానేయడానికి ఇదే సరైన సమయమని సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుతున్నారు. బియ్యాన్ని వదిలేసి కూరగాయ ముక్కలు, సలాడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని, మధుమేహానికి దూరంగా ఉండవచ్చునని సలహాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియక ప్రవాసులు తమ వంటగదిని బియ్యం గోడౌన్లుగా మార్చుకునేందుకు ఆరాటపడుతున్నారు.

View post on imgur.com