కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళ ఆయుర్వేద వైద్యం చేయించుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు కేరళలోని మలప్పురం జిల్లాలో గల కొట్టక్కల్ ఆర్య వైద్య శాలలో ఆయుర్వేద చికిత్స చేయించుకోనున్నట్లు సమాచారం.కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ పీఎం మాధవన్ కుట్టి వారియర్ పర్యవేక్షణలో రాహుల్ కు చికిత్స జరగనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా వైద్య శాలలో ఉంటారని తెలిసింది. మరో రెండు రోజుల్లో ప్రియాంక గాంధీ కూడా చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్తారని సమాచారం. అయితే, రాహుల్ ఏ ఆరోగ్య సమస్యకు చికిత్స చేయించుకోనున్నారనే విషయంపై స్పష్టత లేదు.