DailyDose

25న విద్యాసంస్థల బంద్‌కు పిలుపు-TNI నేటి తాజా వార్తలు

25న విద్యాసంస్థల బంద్‌కు పిలుపు-TNI నేటి తాజా వార్తలు

* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండటంతో ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.88కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

మహారాష్ట్రలో వర్ష బీభత్సం

ఎడతెరిపి లేకుండా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర లో జలవిలయం తరహా పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుని సామాన్య జనజీవనం కుంటుపడగా, వరదల బారిన పడి ఈ సీజన్‌లో ఇంతవరకూ 72 మంది మృత్యువాత పడ్డారు. అధికారిక గణాంకాల ప్రకారం, జూన్ 1వ తేదీ నుంచి ఇంతవరకూ కనీసం తొమ్మిది మంది జాడ గల్లంతు కాగా, 93 మంది వరకూ గాయపడ్డారు.థానే, పాల్ఘర్, రాయ్‌ఘడ్, రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లీలలో కుండపోత వర్షాలను ఎదుర్కోవడానికి NDRF బృందాలు ఇప్పటికే మోహరించగా.. అంతకుముందు జూలై 19న మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌వాడి కుగ్రామంలో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖలాపూర్ తహసీల్ పరిధిలోని కొండ వాలుపై ఉన్న గిరిజన గ్రామం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. 86 మంది గ్రామస్తుల జాడ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

మహానంది ఆలయంలో భయం భయం

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా మహానంది వెలుగొందుతుంది. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆలయం నల్లమల అడవి ప్రాంతంలో ఉండటంతో కొండచిలువలు, విష సర్పాలు వంటివి ఆలయం,ఆలయం పరిసర ప్రాంతాలు, కాలనీలలో తరచూ ప్రత్యక్షం కావడం అందరిలోనూ ఆందోళన కల్గిస్తుంది. ఒక వారం పరిధిలో రెండు పెద్ద కొండచిలువలు ఆలయ పరిసరాల్లో హల్‌చల్‌ చేయడం కలకలం రేపుతుంది. వరుస సంఘటనలతో ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు.మహానంది ఆలయానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. ఆలయంలో కొలువై ఉన్న శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. ఆహ్లాదకరమైన నల్లమల అడవి ప్రాంతంలో దేవాలయం ఉండటంతో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని తన్మయత్వం పొందుతుంటారు.ఆలయ పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణం తో పాటు అటవీ ప్రాంతం దగ్గర గా ఉండటంతో విష సర్పాలు, కొండచిలువలు, వన్యమృగాల తాకిడి కూడా అదే విధంగా ఉంటుంది. గత వారం రోజుల పరిధిలో అతి పెద్దవైన రెండు కొండ చిలువలు ప్రత్యక్షం కావడం కలవరానికి గురి చేస్తుంది. ఒక కొండ చిలువ ఆలయం సమీపంలోని అయ్యన్న నగర్ లోని ఓ ఇంటి సమీపంలో ప్రత్యక్షం కాగా, మరో కొండ చిలువ ఆలయం పరిసరాల్లో ప్రత్యక్ష అయింది. రెండు కొండ చిలువలు స్థానిక స్నేక్ క్యాచర్ మోహన్ చాకచక్యంగా పట్టుకొని నల్లమల అడవిలో వదిలి వెయ్యడంతో స్థానికులు, భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

ప్రజల వ్యక్తిగత డేటా ఎవరు సేకరించమన్నారు?

‘‘వాలంటీర్లకు బాస్‌ ఎవరు? ప్రజల వ్యక్తిగత డేటా సేకరించాలని వారికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ప్రైవేటు కంపెనీయా? ఒకవేళ అదే అయితే దాని అధినేత ఎవరు? అలాకాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఆ ఆదేశాలు ఇచ్చిందా? అలాగైతే ఆ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా? ముఖ్యమంత్రా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరు?’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విటర్‌లో ప్రశ్నలు సంధించారు. ప్రజల డేటా సేకరిస్తున్న విషయంలో వైకాపా ప్రభుత్వం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరారు. ఈ ట్వీట్‌కు ప్రధానమంత్రి కార్యాలయాన్ని, కేంద్ర హోంమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేశారు. మరో ట్వీట్‌లో నెల్లూరు ఎస్పీ కె.తిరుమలేశ్వర్‌రెడ్డి జూన్‌ 27న విలేకర్ల సమావేశంలో చెప్పిన అంశాలను జతచేశారు. అందులో ఎస్పీ మాట్లాడుతూ లీకైన ఒక వేలిముద్ర ఆధారంగా నకిలీ వేలిముద్ర తయారుచేసి ఆధార్‌ నంబరు ఆధారంగా ఒక ఖాతాలో నుంచి వారి ఖాతాకు రూ.51.25 లక్షలు బదిలీ చేసుకున్నారని వెల్లడించారు. ప్రజల డేటా పక్కదోవ పడితే ఎంత ప్రమాదమో వివరించేందుకు పవన్‌కల్యాణ్‌ ఈ వీడియోను జతచేశారు.

25న విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 25న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు AISF, TNSF, NSUI, AISA, DSF విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు నాణ్యమైన భోజనం అందక, సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసరల ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. చాలాసార్లు ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న పేద ఇంటర్మీడియట్ విద్యార్థులకు గతంలో ప్రభుత్వం ఉచితంగా మెటీరియల్స్ ఇచ్చేదని, ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీ విద్యా విధానంలో ప్రవేశపెడుతున్న మేజర్, మైనర్ సబ్జెక్టు విధానాన్ని విరమించుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు’

హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో GHMC, కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తున్నాయని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. 5రోజు జులుగా సిబ్బంది క్షేత్రస్థాయిలోనే ఉన్నారని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 900 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నగరంలో 483 శిథిల భవనాలను గుర్తించామని, 19 భవనాలను సీజ్ చేశామన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ఆమె సూచించారు.

బలహీనపడిన అల్పపీడనం

ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. అయినప్పటికీ ఉపరితల ఆవర్తన రూపంలో దీని ప్రభావం ఉంటుందని తెలిపింది.ఈ నెల 22 నుంచి 24 వరకు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.జులై 25, 26 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.ఈ నెల 24 నుంచి 26 వరకు రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు తాజా బులెటిన్ విడుదల చేసింది.

మొదటిసారి ఓపెన్ అయిన బండి సంజయ్

కేడర్‌ ముందు మొదటిసారి ఓపెన్‌ అయ్యారు బీజేపీ మాజీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌. పదవి నుంచి తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో ఫిర్యాదులతోనే తన పదవి పోయిందని పరోక్షంగా ఆయన అంగీకరించారు. ఢిల్లీకి ఫిర్యాదులు, తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల జీవితాలు నాశనం చేయవద్దన్న బండి సంజయ్.. కిషన్‌ రెడ్డిపైనా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వొద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రాధ్యక్ష పదవి పోయినప్పటి నుంచి ఆ విషయంలో మౌనంగా ఉన్న బండి సంజయ్.. దీనిపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.ఇంతకీ బండి సంజయ్‌పై ఫిర్యాదు చేసింది ఎవరు? ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? పార్టీలో సంచలనంగా మారాయి బండి సంజయ్ వ్యాఖ్యలు. పార్టీలో అంతర్గత వర్గపోరు కారణంగానే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తప్పించిందన్న చర్చ నడుస్తోంది. అధిష్టానానికి ఫిర్యాదు చేసిన వారిపై బండి వర్గం ఆగ్రహంతో ఉంది. బండి సంజయ్ ప్రసంగిస్తుండగానే ఆయనకు మద్దతుగా కార్యకర్తల నినాదాలు చేశారు. బండికి బాసటగా ఉంటామని నేతల ప్రకటనలు చేశారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కృష్ణా నదిపై ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 517 అడుగులకు చేరింది. సాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 143.86 టీఎంసీల నీరు ఉంది. వరద నేపథ్యంలో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,988 క్యూసెక్కులుగా ఉంది. రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ సంస్థ పేర్కొన్న నేపథ్యంలో, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చే అవకాశమున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

వివేకా హత్యకేసు ఛార్జిషీట్లో కీలక విషయాలు

 వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత CBIకి కీలక విషయాలు వెల్లడించారు. ఆమె వాంగ్మూలాన్ని వివేకా హత్య కేసు ఛార్జిషీట్తో CBI కోర్టుకు సమర్పించింది. ‘నాన్న మరణించాక వైఎస్ భారతి ఇంటికొచ్చి కలుస్తానని ఫోన్ చేశారు. ఆ సమయంలో ఆమె ఆందోళనగా ఉన్నారు’ అని వాంగ్మూలంలో సునీత చెప్పారు. నాన్న మరణించాక భారతి బాధగా ఉన్నారని అనుకున్నానని.. కానీ ఇకపై ఏం చేసిన సజ్జలతో టచ్ ఉండాలని ఆమె చెప్పారని పేర్కొన్నారు.

రెండు ప్రధాన కూటములకు దూరం

గత కొద్ది రోజులుగా దేశంలో రాజకీయాలు రెండు ధృవాలుగా మారిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP)ను వ్యతిరేకించే పార్టీలన్నీ కొత్తగా “ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A)” పేరుతో ఒక్క చోటకు చేరాయి. ఈ కూటమికి పోటీగా బీజేపీ కూడా మూలనపడేసిన ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)’ బూజు దులిపి బలప్రదర్శన చేసింది. ఐఎన్డీఐఏ కూటమిలో కాంగ్రెస్ సహా 26 పార్టీలు కనిపించగా, ఎన్డీయేలో బీజేపీ సహా 38 పార్టీలు చేతులుకలిపాయి. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ అయితే అటు, లేదంటే ఇటు అన్న చందంగా జట్టుకట్టాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల సరళి కూడా దాదాపు అలాగే ఉండేలా కనిపిస్తోంది. బీజేపీకి అనుకూలంగా ఉంటే అటు ఓటు పడుతుంది.. లేదంటే ఐఎన్డీఐఏ కూటమికి ఓటు పడుతుంది అన్నట్టుగా పరిస్థితి మారింది. బైపోలార్ పాలిటిక్స్ మాదిరిగా మారిన ఈ పరిస్థితుల్లోనూ ఏ కూటమిలోనూ లేకుండా సొంతంగా తమ ఉనికి చాటుకుంటున్న తటస్థ రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. అవేమీ చిన్నా, చితకా పార్టీలు కూడా కాదు. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండడమే కాదు, పార్లమెంటులో మొత్తం 91 మంది ఎంపీల సంఖ్యాబలంతో ఏ కూటమిలోనూ లేని 11 రాజకీయ పార్టీలున్నాయి. అంటే దేశంలో ఇండియా, ఎన్డీయే మాత్రమే కాదు, వీటితో సంబంధం లేని తృతీయ శక్తి కూడా ఉందని స్పష్టమవుతోంది. మరి ఆ థర్డ్ ఫోర్స్.. కూటమిగా జట్టు కడతాయా లేక సొంత బలంతో ఎక్కడికక్కడ తమ అస్తిత్వాన్ని, బలాన్ని చాటుకుంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది

నెల్లూరు వైసీపీ అభ్యర్ధులు ఫిక్స్

మరొకసారి ఏపీలో అధికారం దక్కించుకునే దిశగా జగన్ వెళుతున్నారు. మళ్ళీ టి‌డి‌పికి చెక్ పెట్టి సింగిల్ హ్యాండ్ తో వైసీపీని గెలిపించనున్నారు. జగన్ ఇమేజ్ తో వైసీపీ విజయం దిశగా వెళుతుంది. ఇక పూర్తిగా వైసీపీ హవా ఉండే జిల్లాల్లో మళ్ళీ సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరులో మళ్ళీ వైసీపీ వన్‌సైడ్ గా గెలవడం ఖాయం.ఇక ఇక్కడ వైసీపీ అభ్యర్ధులు దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే..మళ్ళీ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమే. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టి‌డి‌పి వైపుకు వెళ్లారు. దీంతో వైసీపీకి 7 గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 7 గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మళ్ళీ సీటు దక్కే వారు..సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫిక్స్..అక్కడ ఈజీగా గెలుస్తారు. ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేస్తారు. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్, కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెడీ.సూళ్ళూరుపేటలో సంజీవయ్య, కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. ఇటు నెల్లూరు రూరల్ లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. వెంకటగిరి సీటు తాజాగా జగన్..నేదురుమల్లి రామకుమార్ రెడ్డికి ఫిక్స్ చేశారు. అటు ఉదయగిరి సీటు మేకపాటి ఫ్యామిలీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఒక గూడూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు డౌట్..మిగిలిన సీట్లు దాదాపు ఫిక్స్ అని చెప్పవచ్చు. మొత్తానికి నెల్లూరులో ఈ సారి వైసీపీ 7 సీట్లు ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది.