చాట్‌జీపీటీ (ChatGPT) రాకతో కృత్రిమ మేధ (AI) ఆధారిత చాట్‌బాట్‌లను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఆయా సంస్థలు ప్రత్యేకంగా యాప్‌లను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే చాట్‌జీపీటీ తన యాప్‌ను మే నెలలోనే ఐఫోన్ (IOS) యూజర్లకు పరిచయం చేయగా.. రానున్న వారంలో ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు కూడా అందించనుంది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికార ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ఆండ్రాయిడ్ యూజర్లు వచ్చే వారం నుంచే చాట్‌జీపీటీ యాప్‌ను వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఏ రోజున తీసుకొస్తామన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో లిస్ట్ అయిందని వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానుందంటూ కంపెనీ తెలిపింది. యాప్ రిలీజ్ అయిన వెంటనే చాట్‌జీపీటీ సేవలు పొందాలనుకొనే వారు మాత్రం ముందుగానే గూగుల్ ప్లే స్టోర్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది.
కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌లైన చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ చాట్‌బాట్ (Bard chatbot)ల మధ్య పోటీ పెరిగింది. అయితే ఇప్పటివరకు గూగుల్ బార్డ్‌కు ప్రత్యేక మొబైల్ యాప్ లేదు. కానీ, మైక్రోసాఫ్ట్ (Microsoft) మాత్రం ఫిబ్రవరిలోనే తన బింగ్ (Bing) యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఫోనల్లో అందుబాటులోకి తెచ్చింది. అయితే చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ రాకతో గూగుల్ బార్డ్ కొంత పోటీని ఎదుర్కోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.