సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ–56 ప్రయోగాన్ని నిర్వహించనున్నామని షార్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రయోగాన్ని ఈనెల 23న నిర్వహింయాల్సి ఉంది. చంద్రయాన్–3 మిషన్‌ను లూనార్ ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియలో ఇస్రో శాస్త్రవేత్తలంతా నిమగ్నమై ఉండడంతో ఈ ప్రయోగాన్ని 30కి పొడిగించారు.ఈ ప్రయోగంలో 422 కిలోలు బరువు కలిగిన సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 351 కిలోల డీఎస్–ఎస్‌ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోలు బరువు కలిగిన ఆర్కేడ్, 23 కేజీల వెలాక్స్–ఏఎం, 12.8 కిలోలు బరువు కలిగిన ఓఆర్‌బీ–12 స్ట్రైడర్, 3.84 కేజీల బరువున్న గలాసియా–2, 4.1 కేజీల బరువైన స్కూబ్–11, 3.05 కేజీల నులయన్ అనే ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైంది కావడం విశేషం.