మణిపుర్(Manipur)లో చోటుచేసుకున్న అమానవీయ ఘటనపై పార్లమెంట్ (Parliament) ఉభయ సభల్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం కూడా చర్చకు సిద్ధమేనని, ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం పార్లమెంట్‌లో చర్చించాల్సిన ఇతర అంశాలను పక్కనపెట్టి.. మణిపుర్ అంశంపై మాత్రమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూల్ 176 (Rule 176) కింద చర్చకు సిద్ధమేనని కేంద్రం చెబుతుంటే.. విపక్షాలు మాత్రం రూల్ 267 (Rule 267) కింద చర్చకు పట్టుబడుతున్నాయి.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘ మేం రూల్ 267 ప్రకారం నోటీసు ఇచ్చాం. కాబట్టి పార్లమెంట్‌లో చర్చించాల్సిన ఇతర అంశాలను పక్కకుపెట్టి, మణిపుర్ ఘటనపై చర్చ జరగాలి. ఈ అంశంపై కేవలం అరగంట చర్చ సరిపోదు. మణిపుర్ సీఎం తక్షణమే రాజీనామా చేయాలి. అక్కడ రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మాట్లాడుతూ..‘‘ప్రతిపక్షాలు ప్రధాని పార్లమెంట్‌కు వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే తమ నిర్ణయాన్ని మార్చుకుంటూ చర్చకు అవకాశం కల్పించడంలేదు’’ అని విమర్శించారు. ఇంతకీ.. ఏంటి రూల్ 176, రూల్ 267. కేంద్రం రూల్ 176 ప్రకారం చర్చిస్తామంటే.. ప్రతిపక్షాలు ఎందుకు రూల్ 267 కింద చర్చకు పట్టుబడుతున్నాయి? ఈ రెండింటీకి (Rule 176 vs Rule 276) మధ్య ఉన్న తేడా ఏంటి?
రాజ్యసభ నిబంధనల ప్రకారం రూల్ 267 కింద.. రాజ్యసభ సభ్యులు ఎవరైనా ఆ రోజు సభలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఇతర సభ్యులు ఇచ్చిన నోటీసులు తాత్కాలికంగా రద్దు చేయాలని కోరుతూ.. దేశం ఎదుర్కొంటున్న సమస్య గురించి చర్చకు డిమాండ్ చేయొచ్చు. ఇందుకోసం రాతపూర్వకంగా సదరు సభ్యుడు నోటీసు ఇస్తే.. దాన్ని రాజ్యసభ ఛైర్మన్ అనుమతిస్తారు. దీనిపై చర్చించే సమయంలో సభ్యులు ప్రభుత్వాన్ని ఏ అంశం గురించైనా ప్రశ్నలు అడగవచ్చు. మణిపుర్ అంశంపై ఈ రూల్ కింద చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
రూల్ 267.. ప్రతిపక్షాలు సభకు అంతరాయం కలిగించే సాధనంగా మారిందని గతేడాది రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar) వ్యాఖ్యానించారు. మరోవైపు గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రూల్ 267 కింద ఇచ్చిన ఎనిమిదికిపైగా నోటీసులను ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. భవిష్యత్తులో ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా రూల్ 267ను కేంద్రం రద్దు చేయొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.1990 నుంచి 2016 వరకు 11 సార్లు మాత్రమే రూల్ 267 కింద చర్చ జరిగినట్లు పార్లమెంట్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చివరగా.. 2016లో అప్పటి రాజ్యసభ ఛైర్మన్ హామీద్ అన్సారీ, నోట్ల రద్దుపై చర్చించేందుకు అనుమతించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఇచ్చిన రూల్ 267 నోటీసులపై చర్చకు రాజ్యసభ ఛైర్మన్ అంగీకరించలేదు.
ఈ రూల్ ప్రకారం అరగంట నుంచి రెండున్నర గంటల సమయం మించకుండా చర్చకు అనుమతి ఉంటుంది. ఈ నిబంధన కింద సభలోని ప్రతి సభ్యుడు ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశంపై చర్చించేందుకు నోటీసు ఇస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాయాలి. అందులో చర్చించాల్సిన అంశానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించడంతోపాటు.. చర్చకు గల కారణాలను ప్రస్తావించాలి. అలాగే, ఆ నోటీసుకు మద్దతుగా ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి. అయితే, ఈ నోటీసు ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలో లేదా మరుసటి రోజు పరిగణనలోకి తీసుకోవచ్చు.
ప్రస్తుతం కేంద్రం మాత్రం రూల్ 176 కింద చర్చకు సిద్ధమేనని చెబుతోంది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం రూల్ 267 కింద మాత్రమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడగా.. రాజ్యసభ మధ్యాహ్నం తిరిగి ప్రారంభంకానుంది.