* శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండటంతో భక్తులు ఏటీసీ కౌంటర్ వరకు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
* నేటి నుంచి ఏపీ బీజేపీ జోనల్ సమావేశాలు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పురంధేశ్వరి అధ్యక్షురాలిగా నియమించిననాటి నుంచి వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి ఏపీ బీజేపీ జోనల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పురంధేశ్వరి కూడా పాల్గొగనున్నారు. పార్టీలో కొత్త కమిటీల రూపకల్పన ముందు జోనల్ సమావేశాలను నిర్వహించాలని పురంధేశ్వరి నిర్ణయించారు. ఈ జోనల్ సమావేశాలు ముగిశాక కొత్త కమిటీలు ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జోనల్ సమావేశం ప్రొద్దుటూరులో నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీన గుంటూరులో కొస్తాంధ్ర జోన్ సమావేశం జరగనుండగా.. 26వ తేదీన రాజమండ్రిలో గోదావరి జోన్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక 27వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.
* వేణుపై పిల్లి సుభాష్ కీలక వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్‌పై వైకాపా సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టం చేశారు. మమ్మల్ని.. వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా?అని ప్రశ్నించారు.
* లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై ఏమన్నారంటే?
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తో సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అస్సలు పడటం లేదు. ప్రభుత్వ పనితీరుపై తమిళిసై, ఆమె వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్ అండ్ కో నేరుగా విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు తరచూ విమర్శిస్తున్నారు. మరోవైపు వచ్చే యేడాది జరగనున్న ఎన్నికల్లో తమిళిసై పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తమిళిసై స్పందించారు.తాను పోటీ చేసే విషయంపై పైనున్న దేవుడు, కేంద్రంలోని బీజేపీ పాలకులు నిర్ణయం తీసుకుంటారని పుదుచ్చేరికి కూడా గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళిసై చెప్పారు. నిన్న పుదుచ్చేరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమిళిసైని అక్కడి మీడియా మీరు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల గవర్నర్‌గా సమర్థవంతంగా పనిచేస్తున్నానని గవర్నర్ చెప్పారు. ఎంపీ పదవికి పోటీ చేసే విషయంపై తనకు తానుగా నిర్ణయం తీసుకోలేనని ఆమె అన్నారు. పైనున్న దేవుడు, పైనున్న పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
* విజయసాయిరెడ్డితో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాలినేని నివాసంలో ఈ సమావేశం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో పరిణామాలు, ఇతర అంశాలపై విజయసాయిరెడ్డికి బాలినేని చెప్పినట్లుగా తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బంధువనే సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక జగన్ తన మంత్రివర్గంలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో.. బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. స్వయంగా జగన్ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు.ఇక, ఇటీవల సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన నేపథ్యంలో మార్కాపురంలో హెలిప్యాడ్ వద్దకు వెళ్లడానికి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని సూచించారు. దీంతో పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కార్యక్రమం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే బాలినేని సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీలు ప్రయత్నించారు. అయితే బాలినేని అక్కడి నుంచి వెనుదిరిగేందుకే నిర్ణయించుకున్నారు.
* ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు అధికారులు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు సూచిస్తున్నారు.. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు రెయిన్ అలర్ట్ జారీ చేస్తూ వెదర్ రిపోర్ట్ ను విడుదల చేసింది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..ఈరోజు కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కర్నూలు,తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురవనుండగా.. ఏలూరు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
* పాలమూరులో 14కు 14 సీట్లు గెలుస్తాం: రేవంత్
గద్వాల జిల్లా కాంగ్రెస్కు కంచుకోట అని.. కొందరు పోయినంత మాత్రాన పార్టీ బలహీనపడదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గద్వాలకు చెందిన పలువురు సర్పంచ్, ఎంపీటీసీలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ‘పాలమూరు బిడ్డకు సోనియా పీసీసీ పదవి ఇచ్చారు. పాలమూరులో 14కు 14 సీట్లు గెలుస్తాం. కేసీఆర్కు తన పాలనపై నమ్మకముంటే గజ్వేల్లోనే పోటీ చేయాలి. సిట్టింగ్లు అందరికీ సీట్లు ఇవ్వాలి’ అని తెలిపారు.
* ఒడెస్సాలో ప్రముఖ చర్చిని కుప్పకూల్చిన రష్యా
ఉక్రెయిన్( Ukrain)లోని ఒడెస్సా నగరంలో ప్రముఖ చర్చిని రష్యా (Russia) నేలమట్టం చేసింది. నిన్న రాత్రి ఈ నగరంపై జరిగిన దాడుల్లో పురాతన చర్చితో సహా ఆరు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. ఈ చర్చి దేశంలోని ప్రముఖ నిర్మాణ చిహ్నాల్లో ఒకటని ఉక్రెయిన్ దక్షిణ ఆపరేషనల్ కమాండ్ పేర్కొంది. ‘‘డజన్ల కొద్దీ కార్లు, అనేక భవనాల ద్వారాలు, కిటికీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి’’ అని ఆ కమాండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో పేర్కొంది
* రష్యా, బెలారస్ అధ్యక్షులు భేటీ
పోలండ్పై దాడి చేయాలని వాగ్నర్ దళాలు ఒత్తిడి చేస్తున్నట్లు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో తెలిపారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఆదివారం రష్యా అధ్యక్షుడు పుతిన్, లుకషెంకో భేటీ అయ్యారు. పోలాండ్ సరిహద్దుల్లో నాటో దళాలను వెనక్కు వెళ్లగొట్టేందుకు వాగ్నర్ దళాలు ఆసక్తిగా ఉన్నాయని లుకషెంకో కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ ప్రతి దాడులు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.
* రాజకీయాల్లోకి నటుడు సూర్య
సినీ పరిశ్రమను రాజకీయాలను వేరు చేసి చూడలేం.. అందులోనూ మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో ఇది కాస్త ఎక్కువే.. దివంగత ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ మొదలు.. కరుణానిధి, జయలలిత కూడా సినీ నేపధ్యం ఉన్నవారే.. ఈ ముగ్గురూ దశాబ్దాలుగా తమిళనాడును పాలించారు.. దేశంలోనే ప్రభావితం చూపిన ముఖ్యమంత్రులుగా గుర్తింపు పొందారు.. ఆ తర్వాత విజయ్ కాంత్, కమలహాసన్..ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు.. విజయ్ కాంత్ తొలుత 2006 లో ఒకే ఒక్కడు గెలవగా.. ఆతర్వాత 2011 ఎన్నికల్లో 29 మందితో ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిలిచారు.. వర్తమాన నటుల్లో ఇంకా మరికొందరు రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు.అయితే సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం పై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది.. కానీ రజని రాజకీయాల్లోకి రాలేదు.. తమిళనాట సినీ హీరోలంటే ఉన్న క్రేజే వేరు.. ఇక వర్తమాన హీరోలు. విజయ్, సూర్య లు కూడా రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ ఉండనే ఉంది.. మాస్ ఫాలోయింగ్ ఉన్న నటులు విజయ్, సూర్య.. నటుడు సూర్య సీనియర్ నటుడు శివకుమార్ కుమారుడు..సూర్య అగరం ఫౌండేషన్ పేరుతో ట్రస్ట్ ను ఏర్పాటు చేసే రెండు దశాబ్దాలుగా పేదలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.. నిజమైన లబ్ధిదారులకు సాయం అందించడంలో అగరం ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోంది.
* గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి
రాజమండ్రి వద్ద మళ్లీ గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చింది. గంట గంటకు స్వల్పంగా నీటిమట్టం పెరుగుతుంది. ఈరోజు ఆదివారం సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని రాజమండ్రిలోని అన్ని స్నాన ఘట్టాలు గేట్లు మూసివేశారు అధికారులు. ఎవరూ నదిలోకి వెళ్లకుండా ఘాట్ల వద్ద బారికేడ్లతో పోలీసుల గస్తీ ఏర్పాటు చేశారు. ఎగువన విలీన మండలల్లోనూ, దిగువన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 22 లంక గ్రామాలను వరదనీరు చుట్టూ ముట్టింది. రహదారులు నీట మునిగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 43.2 అడుగులు ఉండగా.. పోలవరం వద్ద 11.6 మీటర్లకు నీటిమట్టంకు చేరుకుంది. అలాగే.. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.89 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఇవాళ్టి నుంచి ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం వరకు స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతుందని, కాటన్ బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే.. గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో.. ఎగువ ప్రాంతాల నుండి భారీ స్థాయిలో గోదావరిలోకి వరదనీరు చేరడంతో పోలవరం ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు.
* త్వరలో BJPలోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు
తుఫాన్ హెచ్చరిక.. అంటే.. ఇది పొలిటికల్ తుఫాన్ హెచ్చరిక.. ఈ తుఫాన్ ఏం తీరంవైపు వెళ్తోంది.. ఎవర్ని అతలాకుతలం చేయబోతోంది.. ఇదే ఇప్పుడు టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో అతిత్వరలో చాలా కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. భారతీయ జనతా పార్టీలోకి భారీగా చేరికలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన బ్లాస్టింగ్ న్యూస్ టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది. తెలంగాణలో రాజకీయ వలసలపై టీవీ9 బ్లాస్టింగ్ న్యూస్.. త్వరలో BJPలోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు రానున్నాయి. శ్రావణమాసంలో చేరికలకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం.. ఈ ఆపరేషన్ ఆకర్ష్‌లో మాజీ ముఖ్యమంత్రిదే కీరోల్..? 3 దశల్లో చేరికలు.. ప్రత్యర్థులకు చెక్ పెట్టే వ్యూహాలు..కొందరు సిట్టింగ్‌లూ బీజేపీవైపు చూస్తున్నారని లీకులు.. ఓ ముఖ్యనేతకు టచ్‌లో కాంగ్రెస్, BRS అసంతృప్తులు.ఇంతకీ ఆ 15 మంది ఎవరు.. కాంగ్రెస్ వాళ్లా.. BRS వాళ్లా….. BJP నుంచి వాళ్లకు వచ్చిన హామీ ఏంటి.. ఇప్పటికే తాము పార్టీ మారతామనే సంకేతాలు ఆ లీడర్లు ఆయా పార్టీల హైకమాండ్‌కి ఇచ్చారా.. అతి త్వరలో ఈ వివరాలన్నీ బయటకు రాబోతున్నాయి. ఒకట్రెండు చోట్ల ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే సూచనలు ఉన్నాయి.. పార్టీ మారబోతున్న నేతలు టికెట్‌పై హామీ ఇచ్చాకే.. కండువా మార్చబోతున్నారు.. ఈ లిస్ట్‌లో కొందరు ముఖ్యులు ఉన్నట్టు తెలుస్తోంది.అయితే, యాక్షన్ ప్లాన్‌పై సునీల్ బన్సల్‌కు ముఖ్యనేతల సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 100 రోజుల ప్రణాళికతో దూకుడు పెంచబోతున్న బీజేపీ.. బీఆర్ఎస్‌కు ప్రత్యమ్నాయం తామేననేలా స్పీడు పెంచింది. దీనిలో భాగంగా బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని కీలక నేతలు ధీమా వ్యక్తంచేస్తుండటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.