తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ ఆరాదే ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై సమక్షంలో రాజ్‌భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ దాదాపు సంవత్సరం తర్వాత రాజ్‌భవన్ మెట్లు ఎక్కనున్నారు. గత కొంతకాలంగా రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతున్న సంగతి తెలిసిందే. తప్పని పరిస్థితి అయితే తప్ప సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఎదురుపడడంలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సందర్భంగా మరోసారి ఎదురుపడనున్నారు. దీంతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆసక్తి సంతరించుకుంది.అయితే చివరిసారిగా సీఎం కేసీఆర్.. గతేడాది ఉజ్జల్ భూయాన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రాజ్‌భవన్‌కు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి తరుణం రాలేదు. అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కీలక కార్యక్రమాలు చేపట్టినా.. వాటి నుంచి రాజ్‌భవన్‌ని దూరంగానే పెట్టింది. మరోవైపు ప్రభుత్వంపై గవర్నర్.. గవర్నర్‌పై శాసన సభ్యులు విమర్శలకు ప్రతివిమర్శలు కురిపిస్తూనే ఉన్నారు.కాగా, 2022 జూన్ 28 తర్వాత.. అంటే 13 నెలల అనంతరం రాజ్‌భవన్‌కి సీఎం కేసీఆర్ వవస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను అధికారులు చేపట్టారు. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ ఆరాదే ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.