కదలికలను నేర్చుకునే నైపుణ్యాలు నిత్యజీవితంలో పనులు సాఫీగా సాగడానికి దోహదపడుతుంటాయి. అయితే వార్ధక్యం, అనారోగ్యం కారణంగా ఈ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇలాంటివారికి చికిత్సతో ప్రయోజనం ఉంటుందని బెర్లిన్లోని జర్మన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ స్పోర్ట్స్ శాస్త్రవేత్తలు తేల్చారు. మన మెదడుకు బోలెడు ఆక్సిజన్ అవసరం. ప్రాణవాయువు తగ్గిన సందర్భాల్లో విషయ పరిజ్ఞాన సామర్థ్యం క్షీణిస్తుంది. ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో అది తిరిగి కోలుకుంటుంది. వందశాతం ప్రాణవాయువు బట్వాడా ద్వారా.. నాడీ సంబంధిత గాయాలైనవారిలో చాలావరకూ మెదడు పనితీరును పునరుద్ధరించే విధానం ఇప్పటికే అమల్లో ఉంది. అలాగే కదలికలను నేర్చుకునే ‘మోటార్ అభ్యసనం’ కూడా ఆక్సిజన్ ఆధారిత సమాచార ప్రాసెసింగ్, జ్ఞాపకశక్తి విధులతో ముడిపడి ఉంటోంది. గత వైఫల్యాలను సరిదిద్దుకునే విధానం ద్వారా మానవులు నేర్చుకుంటారు. అందువల్ల మోటార్ అభ్యసనం విషయంలోనూ మునుపటి అనుభవాలకు సంబంధించి గుర్తుంచుకోవడం, దాన్ని అనుసంధానం చేయడం చాలా కీలకం. అందుచేత కదలికలకు సంబంధించిన ఒక ఆధారాన్ని అందించడం వల్ల ఆ అభ్యాస ప్రక్రియపై వేగంగా, మరింత వేగంగా పట్టు సాధించొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు.