ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహాన్ని, దానికి అనుబంధంగా రామాలయాన్ని కర్నూలు జిల్లా మంత్రాలయంలో రూ.300 కోట్లతో నిర్మించనున్నారు. జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వర్చువల్ పద్ధతిలో ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. గుజరాత్లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ వాంజీ సుతార్‌కు శ్రీరాముని విగ్రహ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. విగ్రహ నమూనాను ఆయన ప్రాథమికంగా ఖరారు చేశారు. ఆ నమూనా ఆధారంగా రూపొందించిన చిన్న విగ్రహంతో ఆదివారం శంకుస్థాపన చేస్తారు.
రెండేళ్లలో 108 అడుగుల పంచలోహ విగ్రహం తయారుచేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఆ విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు. మంత్రాలయం శ్రీమఠానికి సుమారు కిలోమీటరు దూరంలో పదెకరాల సువిశాల స్థలంలో ఆలయ నిర్మాణం జరగనుంది. పూర్తిస్థాయి రాతి కట్టడంలా ఈ రామాలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ఆలయ ఆకృతుల రూపకర్తల్లో ప్రముఖుడైన డాక్టర్ ఎ.వేలుకు ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఈ పదెకరాల్లోనే తిరుమల వెంకటేశ్వరస్వామి, కాశీలోని విశ్వనాథ ఆలయం, సింహాచలంలోని నరసింహస్వామి దేవాలయం, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం, కేరళ అనంత పద్మనాభస్వామి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, కర్ణాటక చెలువ నారాయణస్వామి ఆలయం, తమిళనాడు మూషణం వరాహస్వామి ఆలయం, మహారాష్ట్రలోని విఠోభా రుక్మిణి ఆలయాలను తలపించే చిన్నపాటి ఆలయాలనూ నిర్మిస్తారు.కోట్ల మంది ఆరాధించే రాఘవేంద్రస్వామికి శ్రీరాముడు ఆరాధ్య దైవం. దీన్ని దృష్టిలో ఉంచుకునే మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శ్రీరాముని విగ్రహ ఏర్పాటుకు అవసరమైన పదెకరాల స్థలాన్ని కేటాయించారు. మంత్రాలయానికి మరో మణిహారంలా ఉండేలా.. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా పంచలోహాలతో 108 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నామని ‘జై శ్రీరామ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకులు రాము, శ్రీధర్ ‘ఈనాడు’కు తెలిపారు